కోమటిరెడ్డి బ్రదర్స్ కు తెలిసొచ్చిందా?

Update: 2017-10-25 14:30 GMT

కోమటిరెడ్డి బ్రదర్స్ కు అసలు విషయం తెలిసొచ్చినట్లుంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ ను ఢీకొనడం అంత సులువు కాదని ఆయన తెలుసుకున్నట్లున్నారు. అందుకే కోమటిరెడ్డి కొంత తగ్గారు. దిగ్విజయ్ సింగ్ ఇన్ ఛార్జిగా ఉన్న కాలంలో కోమటిరెడ్డి బ్రదర్స్ రెచ్చిపోయారు. ఉత్తమ్ ను మార్చాల్సిందేనంటూ పట్టు బట్టారు. ఉత్తమ్ కు వ్యతిరేకంగా తరచూ ప్రకటనలు చేసేవారు. అయితే దిగ్విజయ్ సింగ్ స్థానంలో కుంతియా రావడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ కు కొంత ఇబ్బంది ఎదురయింది. తాము కూడా పీసీసీ రేసులో ఉన్నామంటూ చెప్పుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఇటీవల కాలంలో కొంత మెత్తబడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్ టీఆర్ఎస్ లోకి వెళతారని ప్రచారం జరిగింది. తర్వాత బీజేపీలోకి వెళతారన్నారు. అయితే టీఆర్ఎస్ లోకి గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్లడంతో ఇక వారు ఆ పార్టీలోకి వెళ్లే యోచన విరమించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఒంటికాలుపై లేవడం ప్రారంభించారు. అంతేకాదు కాంగ్రెస్ లో తాము చెప్పినట్లే జరగాలన్నది కోమటిరెడ్డి బ్రదర్స్ అభిప్రాయం. కాని ఉత్తమ్ కూడా కోమటిరెడ్డిని పెద్దగా పట్టించుకోనట్లే వదిలేశారు. అంతేకాదు కోమటిరెడ్డి బ్రదర్స్ చేసే విమర్శలకు సయితం మౌనమే సమాధానం ఇచ్చారు.

సభా వేదికపై నేతల ఫొటోలు.....

అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చేందుకు ప్రధాన సూత్రధారి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావడం, ఆయనకు అధిష్టానంలో మరింత పలుకుబడి పెరగడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ పునరాలోచనలో పడ్డారు. ఉత్తమ్ ను కాదని హైకమాండ్ ఏమీ చేయలేదని తెలుసుకున్నారు. అందుకే నిన్న జరిగిన ఆందోళన కార్యక్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభా వేదికపై ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా ఫొటోలను పెట్టారు. తాను జరిపిన సభల్లో ఏరోజూ ఇప్పటి వరకూ సోనియా, రాహుల్ ఫొటోలు తప్ప రాష్ట్ర నేతల ఫొటోలు పెట్టడం కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఇష్టం ఉండదు. అందుకే ఇప్పటి వరకూ వారు తమ నియోజకవర్గాల్లో సొంతంగానే కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. కాని మారిన పరిస్థితుల కు అనుగుణంగా కోమటిరెడ్డి బ్రదర్స్ సోమవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన రైతు సభలో ఉత్తమ్, కుంతియా ఫొటోలను పెట్టడం చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రాకతో ఉత్తమ్ కు మరింత గ్రిప్ దొరుకుతుందని భావించిన బ్రదర్స్ ఇక పార్టీలోనే ఉండి తమ సీటును తాము కాపాడుకునే ప్రయత్నంలో పడ్డారు.

Similar News