కోదండ‌రాంతో ట‌చ్‌లో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీళ్లేనా..!

Update: 2018-02-05 06:39 GMT

తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పార్టీ ఏర్పాటు వార్తలు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఎలాంటి ప్రకంప‌న‌లు రేపుతున్నాయో ? చూస్తూనే ఉన్నాం. కోదండ‌రాం పార్టీ ఏర్పాటు అక్కడ విప‌క్ష పార్టీల క‌న్నా అధికార టీఆర్ఎస్ వ‌ర్గాల్లోనే ఎక్కువుగా గుబులు రేపుతున్నాయి. ఇక కోదండ‌రాం పార్టీ ఏర్పాటుకే మొగ్గు చూపుతుండ‌డంతో పాటు తాను పార్టీ పెడితే త‌న పార్టీలోకి ఇత‌ర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు వ‌స్తార‌ని కూడా ఆయ‌న ప్రక‌టించిన సంగ‌తి తెలిసిందే.

టిక్కెట్ దక్కని వారు….

త‌న‌తో ఇప్పటికే పది నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ ఆయన ప్రకటించడం అధికార టీఆర్ఎస్ పార్టీని కుదిపేస్తోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యేలు అనేదానిపై అటు ప్రభుత్వం, ఇటు ప్రతి పక్షాలు ఆరా తీస్తున్నాయి. ఇటీవల కొందరు అధికార పార్టీ నేతలు ధిక్కార స్వరం వినిపించడంతో కోదండరాం మాటలకు బలాన్నిస్తోంది. అయితే పదిహేను మందిలో కొందరి పేర్లు బయటికి వినిపిస్తున్నాయి. ఇందులో ఒకరిద్దరు కీలక నేతలు ఉండగా మిగతా వాళ్లుమాత్రం ఈసారి టికెట్ దక్కే అవకాశం లేని ఎమ్మేల్యేలని పలువురు నేతలు అంటున్నారు.

వారు వీరేనా…?

చివ‌ర‌కు ప‌దే ప‌దే స‌ర్వేలు చేస్తోన్న సీఎం కేసీఆర్ సైతం కోదండ‌రాంతో ట‌చ్‌లో ఉంటార‌ని ఊహిస్తోన్న ఎమ్మెల్యేలు ఎవ‌రో త‌న‌కు చెప్పాల‌ని ఇంటిలిజెన్స్ వ‌ర్గాల‌ను ఆదేశించ‌డం, ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు అనుమానిత ఎమ్మెల్యేల క‌ద‌లిక‌ల‌పై నిఘా వేయ‌డం కూడా జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఇటీవల హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. శ్రీనివాస్‌గౌడ్ కోదండ‌రాంతో త‌ర‌చూ ట‌చ్‌లో ఉంటున్నార‌న్న లిస్టులో వినిపించే ఫ‌స్ట్ పేరు.

వారితో వీరు కూడా….

ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, స్టేషన్ ఘన్‌ఫూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే మహబూబాబాద్ నుంచి టికెట్ ఆశిస్తున్న టీఆర్ఎస్వీ రాష్ట్ర నేత రవికుమార్ పేరు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ లో కీలక పాత్ర పోషిస్తున్న నేత ప్రోద్బలంతో నే కోదండరాం తెలంగాణ ప్రజా సమితి పార్టీ ఏర్పాటు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈసారి కూడా టికెట్ దక్కకుంటే మాత్రం చాలా మంది నాయకులు కోదండరాంతో కలిసి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ లిస్టులో ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్‌, ఆదిలాబాద్ జిల్లాల‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మ‌రి కోదండ‌రాం పార్టీ పెట్టాక ఇంకెన్ని సంచ‌ల‌నాలు జ‌రుగుతాయో ? చూడాలి.

Similar News