తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ఏర్పాటు చేయనున్న తెలంగాణ జనసమితి పార్టీలో ఓ కీలక నేత చేరారు. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్ ) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన గాదె ఇన్నయ్య కోదండరాంతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. టీఆర్ఎస్ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన ఇన్నయ్య కొంత కాలం కేసీఆర్ తో కలిసి నడిచారు. పార్టీ కార్యదర్శిగా సమర్థవంతంగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయం, వివక్ష పై విస్తృతంగా అధ్యయనం చేసి, పలు పుస్తకాలు కూడా ప్రచురించారు.
కేసీఆర్ కు అతి సన్నిహితంగా....
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై తెలంగాణ ప్రజలను ఎప్పటికప్పుడు జాగృతం చేస్తూ విస్తృతంగా పర్యటించారు. ఈ క్రమంలో కేసీఆర్, హరీష్ రావు తో విభేదాలు రావడంతో ఆయన టీఆర్ఎస్ కు దూరంగా ఉన్నారు. కేసీఆర్‌తో కలిసి ఉన్నప్పుడు ఆయన ఎంత సన్నిహితంగా ఉన్నారో ? కేసీఆర్‌కు దూరమయ్యాక ఇన్నయ్య ఇప్పుడు అంతే వైరుధ్యంతో ఉంటున్నారు. ఇక తెలంగాణ ఏర్పాటు సమయంలో ప్రొఫెసర్ కోదండరాం జేఏసీ ఏర్పాటు ద్వారా చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఆ తర్వాత కోదండరాంకు కేసీఆర్‌కు మధ్య ఏర్పడిన విబేధాల నేపథ్యంలో చివరకు కోదండరాంకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి రావడం.... చివరకు కోదండరాం పార్టీ పెట్టే వరకు వెళ్లడం జరిగిపోయాయి.
ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసి....
ఇక ఇన్నయ్య విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా జఫర్ ఘడ్ మండల కేంద్రంలో మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఆశ్రమంలో వందల మంది పిల్లలు ఉంటున్నారు. వాళ్లందరికీ ఉన్నతమైన జీవితాలను అందించేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రజా తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. ఇలా టీఆర్ఎస్ దూరమైనప్పటి నుంచి పలు సంస్థలను ఏర్పాటు చేసి ప్రజల మధ్యనే ఉంటున్నారు. కొన్ని నేలలుగా జేఏసీ చైర్మన్ కోదండరాం తో ఇన్నయ్య టచ్ లో ఉంటున్నారు.
పార్టీని విలీనం చేస్తున్నట్లు....
తాజాగా హైదరాబాద్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ప్రజా తెలంగాణ పార్టీని కోదండరాం ఏర్పాటు చేస్తున్న పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. మరికొందరు కీలక నాయకులు కూడా కోదండరాం పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా వుండగా... వచ్చే ఎన్నికల్లో ఇన్నయ్య కోదండరాం పార్టీ తరపున వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పలువురు నాయకులు అంటున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఫేస్ బుక్ వేదికగా తనను వరంగల్ తూర్పు నుంచి పోటీ చేయాలని కోరుతున్నారనీ.. మరి మీరేమంటారు.. అంటూ అభిప్రాయ సేకరణ చేపట్టారు. గతంలో ఇన్నయ్య పీపుల్స్ వార్ లో పని చేశారు. ఆ సమయంలో వరంగల్ తూర్పులో ఆయనకు తూర్పు నియోజకవర్గ ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నట్లు సమాచారం. మరోవైపు సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖపై ప్రజల్లో, పార్టీ క్యాడర్లో కొంత వ్యతిరేకత ఉంది. ఈ క్రమంలోనే ఆయన ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్టు తెలుస్తోంది.