కోదండరామ్ మళ్లీ సై అంటున్నారు..!

Update: 2017-12-22 04:30 GMT

ప్రొఫెసర్ కోదండరామ్ మళ్లీ యాత్ర చేపట్టారు. 7వ దశ అమరవీరుల స్ఫూర్తియాత్రకు సిద్ధమవుతున్నారు. నేటి నుంచి నల్లగొండ జిల్లాలో అమరవీరుల స్ఫూర్తియాత్ర కోదండరామ్ చేపట్టనున్నారు. కేసీఆర్ సర్కార్ కోదండరామ్ ను యాత్రలు చేయకుండా నిన్నమొన్నటి వరకూ అడ్డుపడుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అమరవీరుల స్ఫూర్తియాత్ర పేరుతో కోదండరామ్ ప్రజలను రెచ్చగొడుతున్నారని శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్నారని టీఆర్ఎస్ విమర్శిస్తోంది. అందుకు యాత్రకు పోలీసులు కూడా అనుమతించడం లేదు.

నేటి నుంచి నల్లగొండ యాత్ర...

గతంలో చేపట్టిన జిల్లాల్లోనూ కోదండరామ్ యాత్రను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. కొన్ని చోట్ల ఘర్షణలు కూడా జరిగాయి. వరంగల్ మార్కెట్ యార్డుకు వెళ్లిన సందర్భంగా కోదండరామ్ మీద దాడిచేసినంత పని చేశారు. అయితే కోదండరామ్ మాత్రం తాను అనుకున్నది చేస్తానంటున్నారు. ఇటీవల కొలువుల కోసం కొట్లాట సభలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఆయన న్యాయస్థానం నుంచి అనుమతి తెచ్చుకుని సభను నిర్వహించాల్సి వచ్చింది. ముఖ్యంగా కోదండరామ్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కొన్ని వర్గాల బతుకులు బాగుపడటం లేదని ఆరోపిస్తున్నారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని పక్కన పెట్టారని ఆయన ఆవేదన చెందుతున్నారు.

ప్రభుత్వంపై సూటి విమర్శలు....

ముఖ్యంగా తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని ప్రభుత్వం విస్మరించిందనే కారణంతోనే ఈ యాత్ర చేపట్టినట్లు కోదండరామ్ తెలిపారు. దొంగలెక్కలతో అరకొర కొందరికి సాయం చేసిన ప్రభుత్వం అర్హులైన వారందరినీ పక్కనపెట్టిందన్నారు. అంతేకాకుండా యాత్ర సందర్భంగా స్థానిక సమస్యలపై కూడా స్పందిస్తున్నారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో నెలకొన్న ఫ్లోరైడ్ సమస్యపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నిస్తున్నారు. ఎస్టీ రిజర్వేషన్లపై వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆదివాసీ, గిరిజనుల మధ్య సమస్య ఎందుకు వచ్చిందని ఆయన సూటిగా ప్రశ్నించారు. తెలుగు మహాసభల్లోనూ ప్రభుత్వం వివక్షత చూపిందని, గద్దర్, విమలక్క, అందెశ్రీ వంటి వారిని ఆహ్వానించకపోవడం బాధాకరమన్న కోదండరామ్ వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. మొత్తం మీద నేడు జరిగే కోదండరామ్ అమరవీరుల స్ఫూర్తి యాత్ర ఎలా సాగుతుందో నన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది.

Similar News