తెలంగాణ రాజీకీయ జేఏసీ కోదండరామ్ రాజకీయ పార్టీపై కొంత క్లారిటీ ఇచ్చారు. జేఏసీలో కొన్నాళ్లుగా చర్చ జరుగుతుందన్న ఆయన ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను నిర్మించాలన్నది కోదండరామ్ ఆలోచన గా ఉంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మరో పార్టీని తెరమీదకు తీసుకురావాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. కోదండరామ్ వెనక మేధావి వర్గం కూడా సమాలోచనలు జరుపుతోంది. ప్రముఖుల సలహా మేరకు, జేఏసీలో పెరుగుతున్న వత్తిడితో ప్రొఫెసర్ త్వరలోనే రాజకీయ పార్టీకి శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే ఆయన అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగానే రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అయితే ఇందులో కలిసి వచ్చేదెవరన్నది ప్రశ్న.
రాజకీయ పార్టీ పెడితే....
ఇప్పటి వరకూ కోదండరామ్ జేఏసీ నేత మాత్రమే. ప్రొఫెసర్ గా ఆయనకున్న గౌరవం, ప్రజల్లో ఆయనకున్న ప్రతిష్టను చూసి కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు కోదండరామ్ ఉద్యమాల్లో కలిసి వచ్చాయి. జేఏసీని రాజకీయ పార్టీగా మారిస్తే ఈ పార్టీలు కలిసి వచ్చేందుకు అవకాశాలు తక్కువనే చెప్పాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో పొత్తులతోనే వెళదామనుకుంటున్నా.... కోదండరామ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశముంది. కోదండరామ్ ఇటీవల కాలంలో లోకల్ ప్రస్తావన ఎక్కువగా తీసుకొస్తున్నారు. తాజాగా మెట్రో రైల్ ప్రాజెక్టులోనూ స్థానికులకే అవకాశం ఇవ్వాలని కోదండరామ్ డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికీ సెటిలర్లు ఎక్కువగా ఉన్నారు. దాదాపు ఐదు జిల్లాల్లో వారు గెలుపోటములపై ప్రభావం చూపనున్నారు. ప్రొఫెసర్ లోకల్ నినాదంతో మిగిలిన పార్టీలు కొంత వెనక్కు తగ్గే అవకాశముందని చెబుతున్నారు. మరి కోదండరామ్ ఎవరితో కలసి వెళతారన్నది చర్చనీయాంశంగా మారింది. సీపీఎం మాత్రం ఖచ్చితంగా కోదండరామ్ తో పయనిస్తుందని చెబుతున్నారు. మొత్తం మీద కోదండరామ్ ప్రయత్నాలు చేసే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సాధ్యమవుతుందా? అన్నదే ప్రశ్న.