తెలంగాణ జేఏసీ రాజకీయ పార్టీ కాదు. కేవలం ఉద్యమ సంస్థ మాత్రమే. అందుకే తెలంగాణ ప్రభుత్వం జేఏసీ కార్యక్రమాలకు అనుమతివ్వడం లేదా? రాజకీయ పార్టీ అయితే అనుమతి సులువుగా లభిస్తుంది.కాని జేఏసీ ఏ కార్యక్రమం తలపెట్టినా మాత్రం ప్రభుత్వం అనుమతిని నిరాకరిస్తుండటం టీజేఏసీ నేతలకు మింగుడుపడటం లేదు. తాజాగా కొలువుల కొట్లాట పేరుతో ఎన్టీఆర్ స్టేడియంలో సభ జరుపుకుంటామని టీజేఏసీ అనుమతి కోరింది. అయితే ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో విచారణ సందర్భంగా సరూర్ నగర్ స్టేడియంలో అనుతివ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే తాము ఎన్టీఆర్ స్టేడియంలోనే సభను జరుపుకుంటానమి టీజేఏసీ చెబుతోంది. దీనిపై విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. సభ తేదీ త్వరలోనే ప్రకటిస్తామని టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ తెలిపారు.
రాజకీయ పార్టీ పెట్టాలని వత్తిడి....
ఇదిలా ఉండగా టీజేఏసీని రాజకీయ పార్టీగా మార్చాలని అనేక మంది డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ పార్టీ నిర్మాణం దిశగా ప్రయత్నాలు చేయాలని కొందరు కోదండరామ్ పై వత్తిడి తెస్తున్నారు. అయితే ప్రజాసమస్యలపై పోరాటం చేసి వారికి చేరువయిన తర్వాత మాత్రమే రాజకీయ పార్టీ గురించి ఆలోచించాలని కోదండరామ్ భావిస్తున్నారు. రాజకీయ పార్టీగా టీజేఏసీని మారిస్తే ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు పొందనవసరం లేదని టీజేఏసీలోని కొందరు ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు. అయితే టీజేఏసీని రాజకీయ పార్టీగా మార్చేందుకు మరికొంత సమయం ఉందని కోదండరామ్ టీజేఏసీ నేతలతో చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణలో నిర్భంధాన్ని పారదోలాలన్నా...నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ ను ఎదుర్కొనాలంటే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వక తప్పదని ఇటీవల ఘట్ కేసర్ లో జరిగిన టీజేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో అనేక మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే దీనిపై కోదండరామ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు.