కోడ‌లు వైసీపీ ఎమ్మెల్యే... మామ టీడీపీలోకి జంప్‌..!

Update: 2017-12-17 06:30 GMT

ఏపీలో అధికార టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు ఇప్ప‌ట్లో బ్రేకులు ప‌డే సూచ‌న‌లు క‌న‌ప‌డ‌డం లేదు. ఇప్ప‌టికే 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అధికార టీడీపీలోకి జంప్ చేసేసిన సంగ‌తి తెలిసిందే. ఇక వ‌చ్చే సంక్రాంతి త‌ర్వాత రాజ్య‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌డంతో మ‌రింత మంది వైసీపీ ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేందుకు రెడీ అవుతున్నారు. వైసీపీకి ద‌క్కే సింగిల్ రాజ్య‌స‌భ సీటును కూడా త‌మ ఖాతాలోనే వేసుకునేందుకు చంద్ర‌బాబు మ‌రింత మంది ఎమ్మెల్యేల‌ను ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌లో సైకిల్ ఎక్కించుకోనున్నారు.

ఇప్పటికే ఉత్తరాంధ్రలో...

ఇదిలా ఉంటే ఉత్త‌రాంధ్ర‌లో ఇప్ప‌టికే వీక్ అయిన వైసీపీకి మరో షాక్ త‌గ‌ల‌నుంది. బొత్స వైసీపీ ఎంట్రీతో విజ‌య‌న‌గ‌రం జిల్లా వైసీపీ అంతా స్మాష్ అయిపోతోంది. బొత్స వైసీపీ ఎంట్రీని నిర‌సిస్తూ బొబ్బిలి రాజులు సైకిల్ ఎక్కేసి, ఏకంగా మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్కించుకున్నారు. ఇక ఎమ్మెల్సీ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి కూడా బొత్స‌తో వేగ‌లేక పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఇప్పుడు మ‌రో సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ఒక‌రు వైసీపీకి షాక్ ఇచ్చి టీడీపీలో చేరే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

కోడలు ఎమ్మెల్యే అయినా...

మ‌రో ట్విస్ట్ ఏంటంటే పార్టీ మారుతోన్న మాజీ ఎమ్మెల్యే కురుపాం వైసీపీ ఎమ్మెల్యే పాముల పుష్ప‌శ్రీవాణికి స్వయానా మామ కావ‌డం విశేషం. ఆయ‌న గ‌తంలో ర‌ద్ద‌యిన నాగూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత వైసీపీలో ఉన్న ఆయ‌న ఇప్పుడు టీడీపీలో చేర‌నున్నారు. తాజాగా కురుపాం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఎమ్మెల్సీ శ‌త్రుచ‌ర్ల విజ‌య‌రామ‌రాజు ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన పార్టీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో పాల్గొన్న చంద్ర‌శేఖ‌ర‌రాజు తాను టీడీపీలో చేరుతున్న విష‌యాన్ని ధృవీక‌రించారు.

వైఎస్ కు అత్యంత సన్నిహితుడు...

షాక్ ఏంటంటే చంద్ర‌శేఖ‌ర‌రాజు ఎవ‌రో కాదు కురుపాం వైసీపీ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి భర్త, అరకు పార్లమెంటు వైసీపీ ఇన్‌చార్జి శత్రుచర్ల పరీక్షిత్‌రాజు తండ్రి కావడం. ఇక 1989లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున నాగూరు ఎమ్మెల్యేగా గెలిచిన చంద్ర‌శేఖ‌ర్‌రాజుకు దివంగ‌త మాజీ సీఎం వైఎస్‌కు అత్యంత స‌న్నిహితుడిగా పేరుంది. వైసీపీ స్థాపించిన‌ప్పుడు కూడా ఆయ‌న జిల్లా నుంచి ముందుగా జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు తెలిపారు. ఇంత‌లో ఏం జ‌రిగిందో ? గాని త‌న కోడ‌లు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నా, కొడుకు అర‌కు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్నా ఆయ‌న టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. త్వరలో ఎమ్మెల్సీ విజయరామరాజు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలసి ఆయన సమక్షంలో పసుపుకండువా కప్పు కుంటారు. ఇక చంద్ర‌శేఖ‌రరాజు టీడీపీలోకి రావ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారి టీడీపీకి అనుకూలంగా మార‌తాయ‌న్న చ‌ర్చ‌లు జిల్లాలో వినిపిస్తున్నాయి.

Similar News