కోడికి త‌లొగ్గిన బాబు..!

Update: 2018-01-08 09:30 GMT

ఏపీలో సంక్రాంతికి కోడి పందేల‌కు అవినాభావ సంబంధం! బావ మ‌రద‌లు మ‌ధ్య ఎంత సంబంధం ఉంటుందో కోడికి-సంక్రాంతికి మ‌ధ్య అంతే సంబంధం ఏపీలో కామ‌న్‌! దీనిని ఎవ‌రూ ప్రశ్నించ‌జాల‌రు. ఒక‌వేళ ప్రశ్నించినా.. వారు ప్రశ్నగా మిగిలిపోతారు త‌ప్పితే.. ప్రశ్నకు స‌మాధానంగా మాత్రం మిగ‌లలేరు! సాధార‌ణంగా కోడిని కోస్తే.. పండ‌గ‌! కానీ, సంక్రాంతి రూటు స‌ప‌రేటు! కోడి ఆడితే పండ‌గ‌... ఆడి గెలిచినా, ఆడ‌లేక ఓడినా అంతా సంక్రాంతి సంబ‌రాల్లో క‌లిసి పోవాల్సిందే! ఇక‌, కోడి పందేల‌కు పెట్టింది పేరైన ఉభ‌య గోదావ‌రి జిల్లాలో కోడి పందేల సంద‌డి దాదాపు ఆర్నెల్ల ముంగిటే.. ముచ్చట‌గా ఆరంభ‌మై.. సంక్రాంతి నాటికి వాడి వేడిగా జ‌రిగిపోతుంది. ఈ విష‌యాన్ని ఎంత ప‌ట్టించుకోకుండా ఉంటే అంత మంచిది!

ప్రతి సంక్రాంతికి ఇదో తంతు....

అయితే, ఔత్సాహిక జంతు ప్రేమికులు మాత్రం కోళ్లను కోసుకు తినేందుకు ఓకే అంటున్నా.. వాటి ముచ్చట‌తీరా కొట్టుకోనిచ్చేందుకు, ఆ ముచ్చట‌ను తిల‌కించి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టే టెన్షన్‌ను ఆస్వాదించేందుకు మాత్రం స‌సేమిరా అంటున్నారు. అందుకే ప్రతి సంక్రాంతికీ కోళ్లు కేంద్రంగా ఏదో ఒక వివాదం జ‌రుగుతూనే ఉంది. ఉంటుంది కూడా! కోడి వ‌ర్సెస్ కోర్టు! గెలిచేది కోడైన‌ప్పుడు.. కోర్టుల కెక్కితే మాత్రం ఏమైంది అనుకుంటున్నారు పందెం రాయుళ్లు! దీంతో కోళ్లు కూడా జూలు విదిలిస్తూ.. జ‌బ్బలు చ‌రుస్తూ.. త‌న్నుకునేందుకు రెడీ అయిపోతున్నాయి. ఇక‌, అధికార ప‌క్షం టీడీపీ నుంచి కూడా కోళ్లకు అభ‌యం ల‌భించేసింది. సాక్షత్తూ సీఎం లాంటి వాడు.. కోళ్ల ప‌క్షాన కోడి జ‌పం చేస్తున్నారు. కొట్టుకునేవాళ్లను కొట్టుకోనీయండ‌ని పార్టీనే వ‌దిలేసిన మారాజుకు.. కోళ్లపై ఆ మాత్రం క‌నిక‌రం లేక‌పోతే త‌ప్పుప‌ట్టాలి!

కోర్టు తప్పుపడుతున్నా....

కానీ, బాబు అంత క‌నిక‌రం లేనివాడు కాదు! క‌ని.. క‌ర‌ముల‌తో క‌రుణించే త‌త్వం ఉన్నవాడు క‌నుక‌నే కోళ్లు సైతం భ‌రోసాగా వెన్ను విరిచి పందెం రేసు కోర్సులో ఫోర్సుగా దుమికేందుకు ఫ‌స్ట్‌గా నిలిచిపోయాయి. ఇక‌, కోడి పందేలు వేయ‌రాదు. వేసిన వాడు వెధ‌వ‌! అన్న కోర్టు మాట‌లు.. చెవిన ప‌డుతున్నా.. మేం పందేలు ఆడితే క‌దా.. కోర్టులు క‌ల‌వ‌రించి.. ప‌ల‌వ‌రించేది.. కోళ్లకు మాత్రం స్వాతంత్రం వ‌ద్దా.. అవి మాత్రం కొట్టుకోవ‌ద్దా! ఎంత‌సేపూ మ‌నుషులేనా కొట్టుకునేది అంటూ కొత్త కూనిరాగాలు తీస్తూ.. పందెంరాయుళ్లు.. ప‌నిగ‌ట్టుకుని కోళ్లతో కుస్తీలు తీయిస్తూ.. కోళ్లకు కోళ్లకు మ‌ధ్య జ‌రిగే కోట్లాట‌ను వీక్షించే హృద‌యం ఉండాల‌ని, ఆస్వాదించాల‌ని క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకొస్తున్నారు. దీంతో రాష్ట్రంలో కోడ్‌(డి) పోరు.. కోట్ల రూపాల్లో మారిపోయింది. మేమాడితే.. లోక‌మే ఆడ‌దా! అంటూ పందె రాయ‌ళ్లు.. సిద్ధమైపోతున్నారు. కోడీ.. కోడ్‌.. కోర్టు.. వ‌ర్ధిల్లు గాక! అని అనుకుని తృప్తి ప‌డాల్సిందే!!

పందేనికి అంతా సిద్ధం.....

ఇక ఏపీలో భీమ‌వ‌రం, ఉండి నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రిగే పందేలకు రంగం సిద్ధమ‌వుతోంది. ఇక్కడ పందేలు కోట్లలో జ‌రుగుతుంటాయి. ఇక్కడ పందేల‌కు ఇప్పటికే గోదావ‌రి జిల్లాల్లో భీమ‌వ‌రం, న‌ర‌సాపురం, పాల‌కొల్లుతో పాటు కోన‌సీమ ప్రాంతాల్లో లాడ్జిలు ఇప్పటికే ఫుల్ అయిపోయాయి. ఇక్కడ పందేల‌కు తెలంగాణ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల నుంచి కూడా మంత్రులు రావ‌డం కామ‌న్‌. ఇక మ‌హారాష్ట్రలోని నాందేడ్‌, నాసిక్ ప్రాంతాల నుంచి కూడా పందెం రాయుళ్లు కూడా ఇక్కడ కోడి పందేలకు వ‌స్తున్నారు. ఇక జిల్లాలో ప‌లువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా పందేలాను ద‌గ్గరుండి మ‌రీ వేయించేందుకు రెడీ అవుతున్నారు. ఫైన‌ల్‌గా ఎమ్మెల్యేల ఒత్తిళ్లతో పండ‌గ మూడు రోజులు పందేలు వేసుకునేందుకు చంద్రబాబు త‌లొగ్గిన‌ట్టే తెలుస్తోంది.

Similar News