కొత్త రాజధాని అమరావతి ఎలా ఉంటుందంటే..

Update: 2016-11-30 18:23 GMT

ఏపీ సర్కారు చాలా ప్రతిష్టాత్మకంగా అమరావతి రాజధాని నగర నిర్మాణానికి పూనుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రపంచమే తలతిప్పిచూసేలా అత్యద్భుతమైన రాజధానిని నిర్మిస్తా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే చెబుతూనే ఉన్నారు. ఇప్పటికే వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవనాలు అందుబాటులోకి వచ్చాయి. మౌలిక వసతుల పరంగా కొన్ని రోడ్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభం అయింది. పెద్ద రోడ్లకు కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు అమరావతి నగర మౌలిక స్వరూపం ఎలా ఉండబోతున్నది.. అనేది ఎవరికైనా ఆసక్తికరమైన అంశమే.. అందుకే అమరావతి నగరానికి సంబంధించిన మౌలిక వివరాలు ఇవి.

అమరావతి రాజధాని ప్రాంతం స్థూలంగా ఇలా వుండనుంది. దీని విస్తీర్ణం మొత్తం 8,603 చ.కి.మీ. 2 మెగా నగరాలు, 9 పట్టణాలు సహా 12 అర్బన్ నోడ్స్ వుంటాయి. మల్టీ మోడల్ కనెక్టివిటీ దీని ప్రత్యేకత. ఐదు జాతీయ రహదారులు, పది రాష్ట్ర రహదారులు, ఐదు రైల్వే జంక్షన్లు, 4 జాతీయ జల మార్గాలు, రెండు ప్రత్యేక రవాణా కారిడార్లు, లాజిస్టిక్ హబ్స్-పార్క్‌లు, హైస్పీడ్ రైల్ కారిడార్, అంతర్జాతీయ విమానాశ్రయం, 94 కి.మీ. ఇన్నర్ రింగ్ రోడ్డు, 210 కి.మీ. ఔటర్ రింగ్ రోడ్డు, విశాఖ-చెన్నయ్ పారిశ్రామిక ఆర్ధిక కారిడార్, 217 చ.కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ డెవలప్‌మెంట్, కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం కలిగి వుంటుంది.

అంతర, బాహ్య, ప్రాంతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా కృష్ణానదిపై భారీ వంతెనలు నిర్మించాల్సి వుంది. ఇన్నర్ రింగ్ రోడ్డును స్వయంగా నిర్మాణం చేపట్టాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం బాధ్యతను మాత్రం కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలని యోచిస్తోంది.

నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, రాజధాని నిర్మాణానికి వినియోగించే ప్రతి రూపాయికి ఫలితం వుండాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణంలో భాగస్వాములయ్యే ప్రైవేట్ ఏజెన్సీలు మరింత ప్రతిభ కనబరచాల్సి వుందన్నారు. ఏజెన్సీలు పూర్తిస్థాయిలో పని చేయకుంటే ప్రభుత్వంపై ఆర్ధిక భారం తప్ప ఎటువంటి ప్రయోజనం వుండదని చెప్పారు.

Similar News