ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ నిర్ణయాలు వేగవంతం చేశారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు అనేక రకాలైన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఒకటయినా... కూడా తనను ఎవరూ ఓడించలేరని ప్రూవ్ చేసుకోవడానికి ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు గులాబీ బాస్. ఇప్పటికే బీసీలపై వరాల జల్లు కురిపించారు. ముస్లిం రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానాలు చేశారు. బీసీల సంక్షేమం కోసం అన్ని పార్టీలకు చెందిన బీసీ ఎమ్మెల్యేలతో సమావేశాలు పెట్టి ఏమేం కావాలో మీరే నిర్ణయించమని వారికే ఆప్షన్ ఇచ్చారు.
ఉద్యోగులపై వరాలు....
ఇక ఉద్యోగులపై కేసీఆర్ దృష్టిపెట్టనున్నట్లు తెలిసింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తమ పరిస్థితి మారలేదని అధిక సంఖ్యలో ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగుల బదిలీలు, వేతన సవరణ వంటి విషయాల్లో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కేసీఆర్ గుర్తించారు. ప్రతి ఏడాది కొత్త సంవత్సరంలో ఉద్యోగులకు కానుకలను అందించడం కేసీఆర్ కు అలవాటుగా వస్తుంది. అయితే కొత్త ఏడాదినాడు తెలంగాణ ఉద్యోగులకు తీపి కబురు అందించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు.
వేతన సవరణ సంఘం నియామకం....?
తెలంగాణ ఉద్యోగుల వేతనాలను పెంచేందుకు వేతన సవరణ సంఘాన్ని నియమించేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆర్థికశాఖ పంపిన ప్రతిపాదనకు కేసీఆర్ ఓకే చెప్పినట్లు సమాచారం. దీనిపై కొత్త సంవత్సరంలో నిర్ణయం తీసుకోనున్నారు. 11వ పీఆర్సీని నియమించేందుకు కేసీఆర్ ఎన్నికలకు ముందే రెడీ అవుతున్నారు. ఇదే జరిగితే తెలంగాణలో మొదటి వేతన సవరణ సంఘాన్ని నియమించినట్లవుతుంది. ఈ కమిటీ అధ్యయనంచేసి నివేదిక ఇచ్చిన ఆధారంగా ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి. వేతన సవరణ సంఘం ఛైర్మన్ గా ఎంజీ గోపాల్ ను నియమిస్తారని సచివాలయంలో ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణలో దాదాపు ఐదు లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. వీరందరినీ తమ వైపునకు తిప్పుకునేందుకే కేసీఆర్ వేతన సవరణ సంఘం నియమించనున్నారు. మొత్తం మీద ఎన్నికలకు ఇంకా ఏడాది గడువు ఉన్నప్పటికీ కేసీఆర్ మాత్రం కీలక నిర్ణయాలు తీసుకుంటే అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.