కొడంగ‌ల్‌లో రేవంత్‌పై టీఆర్ఎస్ అభ్యర్థి ఈయనేనా?

Update: 2017-10-30 01:30 GMT

రేవంత్‌రెడ్డి తెలంగాణ పాలిటిక్స్‌లోను, ఏపీ పాలిటిక్స్‌లోను హాట్‌హాట్‌గా ప్రకంప‌న‌లు రేపుతూ వార్తల్లో నిలుస్తున్నాడు. గ‌త ప‌ది రోజులుగా ప్రధాన వార్తల‌న్ని రేవంత్ చుట్టూనే తిరుగుతున్నాయి. టీడీపీకి రాజీనామా చేసే విష‌యంలో ఊరిస్తూ ఊరిస్తూ వ‌స్తోన్న రేవంత్ ఎట్ట‌కేల‌కు శ‌నివారం అమ‌రావ‌తిలో చంద్రబాబును క‌లిసి టీడీపీలో ఉన్న త‌న ప‌ద‌వుల‌తో పాటు పార్టీ ప్రాథ‌మిక స‌భ్యత్వానికి రాజీనామా చేయ‌డంతో పాటు త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేశారు. రేవంత్ స్పీక‌ర్ ఫార్మాట్‌లోనే రాజీనామా చేయ‌డంతో కొడంగ‌ల్‌కు ఉప ఎన్నిక అనివార్యంగానే క‌నిపిస్తోంది. ఇక కొడంగ‌ల్‌కు ఉప ఎన్నిక వ‌స్తుంద‌ని ముందునుంచే ప్లాన్‌తో ఉన్న కేసీఆర్ అక్కడ ప్రత్యేకంగా కాన్‌సంట్రేష‌న్ చేయ‌డంతో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో కోట్లాది రూపాయ‌ల‌తో అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు చేస్తున్నారు. మ‌రోవైపు రేవంత్ అనుచ‌రులు, నిన్నటి వ‌ర‌కు రేవంత్‌తో పాటే ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధుల‌ను టీఆర్ఎస్‌లో కూడా చేర్చుకుంటున్నారు. రేవంత్‌ను ఓడించేందుకు కేసీఆర్ ముందునుంచే కొడంగ‌ల్‌లో చాప‌కింద నీరులా త‌న ప్రణాళిక‌లు దూసుకుపోయేలా చేస్తున్నారు.

రేవంత్‌పై టీఆర్ఎస్ అభ్యర్థి ఖ‌రారేనా.....

ఇదిలా ఉంటే రేవంత్‌రెడ్డిని ఉప ఎన్నిక‌ల్లో ఓడించాలంటే టీఆర్ఎస్ నుంచి బ‌ల‌మైన అభ్యర్థిని పోటీలో దించాలి. వాస్తవానికి నియోజ‌క‌వ‌ర్గంలో ఐదుసార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే గురునాథ‌రెడ్డి బ‌ల‌మైన అభ్యర్థే. అయితే గురునాథ‌రెడ్డి వ‌రుస‌గా రెండుసార్లు రేవంత్ మీద ఓడిపోతున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌లోకి జంప్ చేసి మ‌రోసారి ఓడిపోయారు. దీంతో ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ గురునాథ‌రెడ్డి కంటే ఎమ్మెల్సీ న‌రేంద‌ర్‌రెడ్డి అయితే బెట‌ర్ అని కేసీఆర్ ఫిక్స‌యిన‌ట్టు తెలుస్తోంది. న‌రేంద‌ర్‌రెడ్డిని ఇక్క‌డ నుంచి పోటీ చేయించాల‌ని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఎమ్మెల్సీ న‌రేంద‌ర్‌రెడ్డి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి సోదరుడు. రేవంత్ రాజీనామా చేస్తాడ‌ని ముందునుంచే ఊహిస్తోన్న టీఆర్ఎస్ న‌రేంద‌ర్‌రెడ్డి పేరును వ్యూహాత్మకంగా ఖ‌రారు చేసిన‌ట్టు తెలుస్తోంది. జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌లో రేవంత్ కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నాలుగు జిల్లాల ప‌రిధిలోకి వెళ్లిపోయింది. రెండు మండ‌లాలు వికారాబాద్ జిల్లాలో క‌లిశాయి. దీంతో రేవంత్‌ను అన్ని ర‌కాలుగా టార్గెట్ చేస్తోన్న టీఆర్ఎస్ ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రొటోకాల్ ఇన్‌చార్జ్‌గా న‌రేంద‌ర్‌రెడ్డిని నియ‌మించింది. ఇప్పుడు వ్యూహాత్మకంగా అదే న‌రేంద‌ర్‌రెడ్డిని ఇక్కడ నుంచే బ‌రిలోకి దింపుతోంది.

ముగ్గురు మంత్రుల‌కు అగ్నిప‌రీక్ష.....

రేవంత్ రాజీనామాతో కొడంగ‌ల్ ఉప ఎన్నిక‌పై కేసీఆర్ అప్రమ‌త్తమైపోయారు. కొడంగ‌ల్ ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ వెలువ‌డిన వెంట‌నే ఈ బాధ్యత‌ల‌ను త‌న కుమారుడు కేటీఆర్‌కు అప్పగించ‌నున్నారు. అయితే అంతకంటే ముందుగా కొడంగ‌ల్‌లో ఇత‌ర పార్టీల నేత‌ల‌ను ఆక‌ర్షించే బాధ్యత‌ల‌ను కేసీఆర్ ముగ్గురు మంత్రుల‌కు అప్పగించార‌ట‌. ఉమ్మడి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన మంత్రులు జూప‌ల్లి కృష్ణారావు, ల‌క్ష్మారెడ్డితో పాటు న‌రేంద‌ర్‌రెడ్డి సోద‌రుడు అయిన మంత్రి మ‌హేంద‌ర్‌రెడ్డిల‌కు మండ‌లాల వారీగా బాధ్యత‌లు అప్పగించ‌నున్నట్టు తెలుస్తోంది. ఇక రేవంత్ కూడా ఉప పోరులో గెలిచి త‌న స‌త్తా ఏంటో చాటాల‌ని భావిస్తున్నారు. ఏదేమైనా కొడంగ‌ల్ బై పోల్ కేసీఆర్ వ‌ర్సెస్ రేవంత్ పోరుగాను, 2019 ఫైన‌ల్స్‌కు సెమీఫైన‌ల్‌గాను నిల‌వ‌నుంది.

Similar News