ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయడంతో కొడంగల్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు తప్పవా? రేవంత్ రెడ్డి ఈ నెల 27వ తేదీన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో స్పీకర్ కార్యాలయంలో సమర్పించారు. అయితే రేవంత్ రాజీనామాను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఆమోదించాల్సి ఉంటుంది. అయితే దీనికి కొంత సమయం పట్టే అవకాశముందని భావిస్తున్నారు. స్పీకర్ మధుసూదనాచారి అనారోగ్య కారణాల వల్ల అసెంబ్లీకి హాజరుకావడం లేదు. ఆయన వచ్చిన తర్వాత ఒకసారి రేవంత్ తో మాట్లాడతారని తెలుస్తోంది. రేవంత్ తో స్పీకర్ మాట్లాడిన తర్వాత ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించే అవకాశం ఉంటుంది. సాధారణ ఎన్నికలకు ఇంకా ఒకటన్నర సంవత్సరం గడువు ఉంది. అయితే రాజీనామాను స్పీకర్ ఆమోదించిన అనంతరం ఆరు నెలల్లోపు ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నికను నిర్వహించాల్సి ఉంటుంది. మరి స్పీకర్ నిర్ణయంపైనే ఉప ఎన్నిక ఆధార పడి ఉంది. ఉప ఎన్నిక జరిగితే రేవంత్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కూడా ఉంది. దీంతో తెలంగాణలో మరో నంద్యాల యుద్ధం తప్పదన్నమాట.