తెలంగాణ సీఎం కేసీఆర్‌పై రాష్ట్రంలోని ఆదివాసీ తెగ కత్తులు నూరుతోంది. దాదాపు 40 ఏళ్లనాటి రిజర్వేషన్ల విషయాన్ని తవ్వితీసి కేసీఆర్ కు మెడకు ఉరితాడు బిగిస్తోంది. ఈ క్రమంలో సోమవారం తెలంగాణ బంద్‌కు కూడా ఆదివాసీ నేతలు పిలుపునివ్వడం గమనార్హం. విషయంలోకి వెళ్తే.. రాష్ట్రంలో ఎస్టీ జాబితాలో చేర్చిన లంబాడాలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ.. ఆదివాసీలు ఉద్యమాలకు సిద్ధమయ్యారు. ఎట్టి పరిస్థితిలోనూ తమ డిమాండ్‌ను నెరవేర్చాల్సిందేనని నేతలు పట్టుబడుతున్నారు. వీరికి పలు వర్గాల నుంచి భారీ మద్దతు కూడా లభిస్తుండడంతో విషయం అంత తేలికగా తీసుకునేది కాదని ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో లంబాడాలను దాదాపు 40 ఏళ్ల కిందట ఎస్టీల్లో చేర్చారు.
ప్రభుత్వానికి డెడ్ లైన్....
అయితే, ఇప్పటి వరకు లేని విధంగా ఈవిషయంలో ఆదివాసీలు ఉద్యమాలకు సిద్ధమయ్యారు. లంబాడాలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా.. తమకు నష్టం కలిగిస్తున్నారని పేర్కొంటూ ఆదివాసీ హక్కుల నేతలు కొన్నాళ్ల కిందట రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రభుత్వానికి ఇది వరకే 15 రోజుల వరకు గడువు విధించారు. ఆ లోగా తమ డిమాండ్‌ను నెరవేర్చకపోతే మిలిటెంట్ పోరాటాలకైనా సిద్ధమేనని ప్రకటించారు.వీరికి కేంద్ర మాజీ మంత్రి, ఎస్‌సీ-ఎస్ టీ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఫగన్‌సింగ్ కులస్తే మద్దతు పలకడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీలు చేస్తున్న పోరాటానికి తాను అండగా ఉంటానని ఆయన చెప్పడం మరింతగా ఉద్యమాన్ని వేడెక్కించింది. జనాభా గణన ప్రకారం తెలంగాణలో 1981లో 60 వేల నుంచి 80 వేలుగా ఉన్న లంబాడాలు 2011 జనాభా గణన నాటికి 24 లక్షలు ఎలా అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఎస్టీ కోటాలో లంబాడాలు మాత్రమే లబ్ధి పొందున్నారన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని....
ఇక, ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలనే పోరాటంలో చావడానికైనా సిద్ధమని ఆదివాసీ హక్కుల పోరాట సమితి నేత, తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు అప్పట్లోనే హెచ్చరించారు. తమ డిమాండ్ నెరవేర్చకపోతే... తమ పవరేంటో చూపిస్తామని, మిలిటెంట్ పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఇక, ఆదివాసీల దుస్థితికి కారణం పాలకులేనని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. ఈ క్రమంలో తాజాగా మీడియాతో మాట్లాడిన ఆదివాసీ నేతలు.. తక్షణమే తమ డిమాండ్ నెరవేర్చాలని, లంబాడాలపై ప్రేమ ఉంటే మరో విధంగా రిజర్వేషన్ ఇచ్చుకోవాలని సూచించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, కుమరంభీం విగ్రహానికి చెప్పులదండ వేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పూనెం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మేడారం సమ్మక్క-సారక్క ట్రస్ట్ నుంచి లంబాడీలను తొలగించాలని ఆయన కోరారు. మొత్తానికి ఈ పరిణామం అధికార పార్టీని ఇరుకున పెట్టనుందని అంటున్నారు విశ్లేషకులు. మరి కేసీఆర్ ఎలా పరిష్కరిస్తారో చూడాలి.