కేసీఆర్‌ పై భాజపా న్యాయపోరాటం చేయగలదా?

Update: 2016-10-08 07:50 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భారతీయ జనతా పార్టీ న్యాయపోరాటం చేయగల స్థితిలో ఉందా? రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అనేది చట్ట విరుద్ధమైన చర్య అని మాట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులు, మరి ఆ వైనాన్ని ప్రశ్నిస్తూ.. న్యాయపోరాటం చేయగలిగిన తెగువ కలిగి ఉన్నారా అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది.

తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు పర్వం దాదాపు పూర్తయిపోయినట్లే. 31 జిల్లాలకు కేబినెట్‌ కూడా ఆమోదం తెలియజేసేసింది. రెండు రోజుల్లో కొత్త జిల్లాలు పనిచేయడం కూడా ప్రారంభించేయబోతున్నాయి.

ఇలాంటి సమయంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కొత్త సందేహాలను లేవనెత్తుతున్నారు. కొత్త జిల్లాల వ్యవహారాన్ని ఫైనలైజ్‌ చేసిన కేకేశవరావు కమిటీకి ఎలాంటి చట్టబద్ధత ఉంది అని ఆయన ప్రశ్నిస్తున్నారు. నిజానికి కేకే ఆధ్వర్యంలో వేసిన హైపవర్‌ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికే ఏర్పాటు అయింది. ప్రజల అభ్యంతరాలను స్వీకరించడానికి మాత్రమే ఏర్పాటు అయింది. అంతే తప్ప.. జిల్లాలను డిసైడ్‌ చేసింది వారు కాదు. సాంకేతికంగా ఈ విషయంలో ప్రభుత్వానికి అనుకూలత ఉంది.

అయితే తెలుగుదేశం కూడా కొత్త జిల్లాలు చట్ట విరుద్ధంగా ఏర్పాటయ్యాయని అంటున్నారు. ఇప్పుడు భాజపా కూడా ఆ పాటే పాడుతోంది. కేకే కమిటీకి చట్ట బద్ధత లేదని, లేదా మరో కారణం చెబుతూ.. ప్రశ్నించే బదులు తమ వాదనలో నిజం ఉందని , తమ వాదన సబబు అని వారు భావిస్తే న్యాయపోరాటం చేయవచ్చు కదా అని ప్రజలు భావిస్తున్నారు.

అయినా నాయకులు ఏదో సమావేశాల్లో నాలుగు మాటలు రువ్వేసి, అక్కడితో దులుపుకుని వెళ్లిపోతారు గానీ.. సీరియస్‌గా తమ మాటలకు కట్టుబడి పోరాడేంత ఓపిక వారికి ఉంటుందా?

Similar News