ఆంధ్రులు దొంగలు, దోపిడీదారులు, లఫంగులు, ఒక్క మేధావి ఆంధ్రోళ్ళలో లేరు వంటి పరుష పదజాలంతో ఒకప్పుడు ఏపీ వాసుల గుండెలను గాయపరిచి విలన్ అయిన కేసీఆర్ సరైన టైమింగ్ రైమింగ్ తో ఒక్కసారిగా హీరోగా మారిపోయారు. జాతీయ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ కి ఒక పక్క ప్రశంసలు, మరోపక్క విపక్షాల విమర్శలు సమపాళ్లలో లభిస్తున్నాయి. జనసేన అధినేత హీరో పవన్ కళ్యాణ్ సైతం కేసీఆర్ ను హీరో రేంజ్ లో పొగడటంతో ఆయన జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఎపి లో అత్యధికులు గత అవమానాలు గుర్తు చేసుకుంటూనే స్వాగతిస్తున్నారు. సోషల్ మీడియా నుంచి జాతీయ మీడియా వరకు అంతా కేసీఆర్ కోసమే చర్చ మొదలు పెట్టింది. ఏపీ నెటిజెన్లు అత్యధికశాతం ఆయనపై ప్రశంసల వర్షమే కురిపిస్తున్నారు. ఒకే ఒక్కడని, మగాడ్రా బుజ్జి అంటూ, రకరకాలుగా కేసీఆర్ ను విమర్శించే వారు సైతం ఆయన తాజా తీరుతో అభినందనలు మోతెక్కిస్తున్నారు. కొందరు పార్టీల అభిమానులు సైతం కేసీఆర్ ను పొగుడుతూ ఉంటే మరికొందరు ఆయన గత వైఖరిని బూతులు గుర్తు చేస్తున్నారు. కొందరు తెలుగు తమ్ముళ్లు ఆయన వ్యాఖ్యలు పట్ల హర్షాన్ని వ్యక్తిగతంగా వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసిన హాట్ కామెంట్స్ చంద్రబాబు అని ఉంటే సంబరపడేవాళ్లమని కొందరు ఫెస్ బుక్ లలో సైతం పోస్ట్ చేస్తున్నారు.
తెలంగాణాలో విపక్షాల విమర్శల దాడి ...
ఎపి ప్రజలకు మద్దతుగా వ్యాఖ్యలు చేసి ఆ ప్రాంత వాసుల్లో హీరోగా నిలిచిన కేసీఆర్ రచ్చ గెలిచి ఇంట ఓడుతున్నారు. ఆయన వ్యాఖ్యలపై టి కాంగ్రెస్ మొదలు కొని బిజెపి పక్షాలు తీవ్ర ఆగ్రహ ఆవేశాలతో ఊగిపోతున్నాయి. టి బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ కేసీఆర్ వ్యాఖ్యలపై గరం గరం అయ్యారు. తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ ఎందుకు తన మాట నిలుపుకోలేదని సూటిగా ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం అన్నారు ఎన్నిచ్చారు అని విమర్శించారు. బంగారు తెలంగాణ అన్నారు మార్పు తెచ్చేస్తా అన్నారు ఏమి తెచ్చారు అంటూ తూర్పారబట్టారు. దేశ రాజకీయాల్లో మార్పు తెచ్చేస్తా అంటున్న కేసీఆర్ పార్టీ ఫిరాయింపుల వంటి అక్రమాలను దేశవ్యాప్తంగా తెరతీస్తారా అని నిలదీశారు.
కేసీఆర్ కి సిగ్గుందా అంటున్న కాంగ్రెస్ ...
కేసీఆర్ కి సిగ్గు శరం లేవంటూ ఘాటు విమర్శలకు దిగింది టి కాంగ్రెస్. ఆయన నోటికి ఏది వస్తే అది మాట్లాడతారంటూ ఎద్దేవా చేసింది. వ్యవసాయం కోసం కాంగ్రెస్ ఏమి చేయలేదని ఏ నోటితో చెబుతారంటూ ధ్వజమెత్తింది. ప్రధాని నుంచి ప్రతి ఒక్కరిపై టి సీఎం వాడే బాషా తెలంగాణ సమాజానికే తలవంపు అంటూ విరుచుకుపడింది.
ఎంఐఎం మద్దతు ...
దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం స్వాగతించింది. దీనికి కేసీఆర్ నేతృత్వం వహిస్తే మద్దతు ఇస్తామని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసి ప్రకటించేశారు. బిజెపి, కాంగ్రెస్ లు కాకుండా మరో ప్రత్యామ్నాయం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక వైసిపి నేత బొత్స సత్యనారాయణ గులాబీ బాస్ కామెంట్స్ పై ఆచితూచి స్పందించారు. ప్రస్తుతం ఏపీ సమస్యలపై పోరాటం వాటి పరిష్కారమే తమ పార్టీ లక్ష్యమని మిగిలిన అంశాలపై ఆసక్తి లేదని వ్యాఖ్యానించారు. ఇక దేశవ్యాప్తంగా మీడియా లో కేసీఆర్ వ్యాఖ్యలు హల్చల్ చేస్తున్నాయి. అధికార బిజెపి, కాంగ్రెస్ పార్టీల్లో కేసీఆర్ వ్యాఖ్యలు గుబులు పుట్టించాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కమల వికాసం తరువాత గులాబీ అధినేత హాట్ కామెంట్స్ చేయడం, మోడీ, రాహుల్ కి సవాల్ విసరడం పై రెండు ప్రధాన పక్షాలు లోతుగా అధ్యయనం చేస్తున్నాయి. కేసీఆర్ ఏ పార్టీలతో టచ్ లో వున్నారు. థర్డ్ ఫ్రంట్ లో చేరేది ఎవరు అనే చర్చలు హస్తినలో జోరందుకున్నాయి.