రాజకీయాల్లో ఎప్పుడు గేర్ మార్చి స్పీడ్ పెంచాలో వ్యూహాల్లో దిట్ట సిఎం కేసీఆర్. ఆయనకిది వెన్నతో పెట్టిన విద్య. ఒక పక్క తెలంగాణ లో కాంగ్రెస్ దూకుడు మీద వుంది . యాత్రలమీద యాత్రలతో జనంలోకి దూసుకుపోతున్నారు హస్తం పార్టీ టీం . గులాబీ బాస్ ఇదాంతా చూస్తూ ఎలా ఊరుకుంటారు ? ఆయన కూడా నేరుగా ప్రజా క్షేత్రంలోకి దూకేశారు. పార్టీ బలోపేతం బాధ్యతలను కొడుకు, కూతురు, అల్లుడిపై వదిలేయకుండా ప్రత్యర్థులతో అమితుమీ తేల్చుకోవడానికి యుద్ధం మొదలు పెట్టేశారు.
సింగరేణి కార్మికులపై వరాల జల్లు ....
అధికారంలో వున్న వారికి చేతినిండా ఆయుధాలు ఉంటాయి. వారికి విపక్షాలకన్నా అడ్వాంటేజ్ లు ఎక్కువే. గతంలో హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో టి సీఎం ఇదే మాట చెప్పారు. ప్రభుత్వంలో ఉన్నందున మాకు వుండే అదనపు అడ్వాంటేజ్ లు మేం ఎందుకు వదులుకుంటాం తప్పని సరిగా వాడేస్తామని చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ అదే పనిలో ఉన్నారు. ఎన్నికలకు ముందే అవసరమైన వర్గాలన్నిటికి వరాల జల్లు కురిపించే పనిలో బిజీ అయిపోయారు. తాజాగా సింగరేణి కార్మికులు ఊహించని వరాలను ప్రకటించేశారు గులాబీ బాస్. ఆరు నూరైనా సింగరేణి ని ప్రవైట్ పరం కానీయనని అయినా కానీ కేంద్రం ప్రయివేట్ పరం చేస్తాను అంటే వారి వాటా పైసలు వారి ముఖాన పడేసి రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలోనే సంస్థ నడిపిస్తానని అభయం ఇచ్చారు. ఇక నుంచి సింగరేణి కార్మికులందరికీ ఉచిత విద్యుత్, తాగునీరు అని ప్రకటించారు కేసీఆర్. ఎలక్ట్రిసిటి బోర్డు ను కూడా ప్రయివేట్ పరం ఎట్టి పరిస్థితుల్లో కానివ్వమన్నారు టి సీఎం. ఇలా కేసీఆర్ ఎక్కడికక్కడ స్టార్ట్ చేస్తున్న సరికొత్త ప్రచారం విపక్షాల్లో అలజడి సృష్టిస్తుంది.