అంతన్నారు...ఇంతన్నారు.. వేటుపడిపోతుందన్నారు...కాని పడలేదే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేటు వేయడానికి వెనకడుగు వేస్తున్నట్లు కన్పిస్తోంది. ప్రజా ప్రతినిధులందరూ కలిసి తీర్మానం చేసినా ఆయనపై వేటు వేసేందుకు ముఖ్యమంత్రి సంశయిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ భూపతి రెడ్డిపై సస్పెన్ష్ వేటు పడనుందన్న వార్తలు వెలువడ్డాయి. మరికొద్ది క్షణాల్లో వేటు పడుతుందని కూడా బ్రేకింగ్ లు వచ్చాయి. కాని అది జరిగి పదిహేను రోజులు గడుస్తున్నా ఫలితం లేదు. కారణాలు ఆ పార్టీ నేతలకే తెలియడం లేదు.
విభేదాలు రోడ్కెక్కడంతో...
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. అనేకసార్లు వీరిద్దరి పంచాయతీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు చేరింది. భూపతిరెడ్డిని అనేకసార్లు కేసీఆర్ మందలించారు కూడా. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పారు. కాని భూపతి రెడ్డి అదేం పట్టించుకోకుండా బాజిరెడ్డి వెంట పడుతూనే ఉన్నారు. బాజిరెడ్డి గోవర్థన్ చేస్తున్న కొన్ని పనులపై విజిలెన్స్ ఎంక్వైరీ జరపాలని ఇటీవల భూపతిరెడ్డి అధికారులకు లేఖ ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది.
సస్పెన్షన్ ఏమైంది?
దీంతో నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులందరూ సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు సమావేశమై పార్టీని వీధిలోకి లాగుతున్న భూపతిరెడ్డిని సస్పెండ్ చేయాలని తీర్మానం చేశారు. అందులో కేసీఆర్ కుమార్తె కవిత కూడా ఉన్నారు. ఆ తీర్మానం కాపీని ముఖ్యమంత్రికి, పార్టీకి పంపారు. దీంతో వెంటనే భూపతిరెడ్డిని కేసీఆర్ సస్పెండ్ చేస్తారని భావించారు. కాని పదిహేను రోజులు గడుస్తున్నా కేసీఆర్ దానిని పట్టించుకోలేదు. భూపతి రెడ్డికి ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేద్దామని కేసీఆర్ భావిస్తున్నట్లుంది. అంతేకాదు ఎన్నికల సమయంలో ఒక ఎమ్మెల్సీని సస్పెండ్ చేయడం కూడా పార్టీకి మంచిది కాదని గులాబీ బాస్ అనుకున్నట్లు సమాచారం. మొత్తం మీద భూపతి రెడ్డి సస్పెన్షన్ సిఫార్సును కేసీఆర్ కోల్డ్ స్టోరేజీలో పడేసినట్లేనా? అన్న చర్చ ఆ పార్టీలోనే విస్తృతంగా జరుగుతోంది.