కేసీఆర్ వీరికే పెద్దపీట వేస్తారా?

Update: 2017-10-19 10:30 GMT

రాష్ట్ర కమిటీని నియమించిన కేసీఆర్ ఇక పొలిట్ బ్యూరోపై దృష్టి పెట్టారు. పొలిట్ బ్యూరోతో పాటు, పార్టీ అధికార ప్రతినిధులను కూడా నియమించనున్నారు. దీనిపై కేసీఆర్ ముమ్మర కసరత్తులు చేస్తున్నారు. పొలిట్ బ్యూరోలో వాయిస్ ఉన్న నేతలనే నియమించాలనుకుంటున్నారు కేసీఆర్. విపక్షాల విమర్శలకు ధీటుగా స్పందించేవారికే ఇందులో చోటుంటుంది. సీనియర్లని పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నా వారితో ఎలాంటి ప్రయోజనం లేదని కేసీఆర్ భావిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు, కోదండరామ్ వంటినేతలు చేస్తున్న విమర్శలు తిప్పికొట్టాలన్న యోచన కూడా సీనియర్లకు లేదని ఆయన ఇటీవల ఆగ్రహం వ్యక్తంచేశారు. అందుకోసమే పొలిట్ బ్యూరోలో విపక్షాలపై విరుచుకుపడేవారికే ఛాన్స్ ఉండే అవకాశముంది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి మూడున్నరేళ్లు గడుస్తున్నా నిన్న గాక మొన్న రాష్ట్ర కార్యకవర్గాన్ని ఏర్పాటుచేశారు. ఇక నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు. అయితే దీపావళి తర్వాత పొలిట్ బ్యూరో, అధికార ప్రతినిధులను నియమించాలని కేసీఆర్ భావిస్తున్నారు.

లక్కీ నెంబర్ ఆధారంగానే.....

కేసీఆర్ లక్కీ నెంబర్ 6. అందుకే ఆయనకు ఆరు అంటే అంత ఇష్టం. పొలిట్ బ్యూరోలో కూడా ఆరుగురిని నియమించాలని తొలుత అనుకున్నారట. కాని ఆరుగురైతే అన్ని సామాజిక వర్గాల వారీకి చోటు కల్పించలేమని భావించిన కేసీఆర్ 15 మందితో పొలిట్ బ్యూరోను ఏర్పాటు చేయనున్నారు. 15 మంది అయితే వాయిస్ ఉన్న సీనియర్లకు కూడా చోటు కల్పించవచ్చు. అయితే పొలిట్ బ్యూరోలో ఎవరికి స్థానం దక్కుతుందోనన్న ఉత్కంఠ ఉంది. ముఖ్యంగా గతంలో పార్టీలో సీనియర్ గా ఉన్న నేతలను ఈసారి పక్కనపెట్టనున్నారు. సీనియర్లు అసలు దేనికీ స్పందించకుండా కేవలం తమ పదవులను మాత్రం ఎంజాయ్ చేస్తున్నారని కేసీఆర్ భావించారు. పొలిట్ బ్యూరోతో పాటు రాజకీయాలపై అవగాహన ఉన్న పన్నెండు మందిని అధికార ప్రతినిధులుగా నియమించనున్నారు. ప్రభుత్వ పథకాలు, ముఖ్యమంత్రి ఆలోచనలను ఎప్పటికప్పుడు పసిగడుతున్న వారినే అధికార ప్రతినిధులుగా నియమించనున్నారు. వివిధ టీవీ ఛానెళ్ల చర్చల్లో కూడా వీరే పాల్గొనాలి. వేరే వ్యక్తులు పాల్గొనేందుకు వీలు లేదన్నది టీఆర్ఎస్ నేతల అభిప్రాయం. మొత్తం మీద కేసీఆర్ పొలిట్ బ్యూరోల ఎవరెవరికి స్థానం దక్కుతుందో చూడాలి.

Similar News