కేసీఆర్ మూడో సర్వేలో ఎవరికి మూడింది?

Update: 2017-10-17 07:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి సర్వేకు రెడీ అయ్యారు. గొర్రెల పంపిణీ, భూసర్వే, రైతులకు ఎనిమిదివేల రూపాయల డిపాజిట్, మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ వంటి పనులపై ప్రజల మూడ్ ను మరోసారి సర్వేకు సీఎం కేసీఆర్ సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ రెండు సార్లు సర్వే చేయించారు. కేవలం సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే కాకుండా విపక్ష పార్టీ ఎమ్మెల్యేల స్థానాల్లోనూ సర్వే చేయించారు. ఈ సర్వే మొత్తాన్ని ఒక ప్రయివేటు సంస్థకు అప్పగించారు. 2019 ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఈసారి కేసీఆర్ జరిపించే సర్వే కీలకంగా మారుతుందని టీఆర్ఎస్ నేతలుభావిస్తున్నారు. ఈ సర్వేలో మంచి మార్కులు సాధించిన వారికే టిక్కెట్లు దక్కే అవకాశముంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఒకసారి, మే నెలలో మరొకసారి కేసీఆర్ సర్వే చేయించారు. ఇందులో తొలిసర్వేకు, మలి విడత సర్వేకు కొంత మార్పు కన్పించింది. కొందరు ఎమ్మెల్యేలు పనితీరు మెరుగుపర్చుకోగా, మరికొందరు మాత్రం అట్టడుగున నిలిచిపోయారు. వివిధ వివాదాల్లో చిక్కుకుకున్న ఎమ్మెల్యేలపై కూడా సర్వేలో ప్రభావం కన్పించింది. దీంతో వారిని నేరుగా కేసీఆర్ మందలించారు.

పకడ్బందీగా సర్వే......

అయితే మూడోసారి సర్వేపై మాత్రం కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో అందుబాటులో ఉంటుండటం, నియోజకవర్గ అభివృద్ధిపనులను వేగంగా చేయడం, ప్రజావసరాలను గుర్తించి వెంటనే స్పందించడం వంటి వాటిపైనే ఎక్కువగా మూడో విడత సర్వేను చేస్తున్నారు. దీంతో పాటుగా ఎమ్మెల్యే పట్ల ప్రజల అభిప్రాయాన్ని కూడా తీసుకోనున్నారు. వీరితో పాటు ఆ నియోజకవర్గంలో బలమైన నేతల పేర్లను కూడా ఈ మూడో విడత సర్వేలో సేకరించనున్నారు. సింగరేణి ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న సర్వే కావడంతో గులాబీ నేతల్లో కొంత టెన్షన్ అప్పడే ప్రారంభమయింది. గత సర్వేల్లో పనితీరు బాగాలేని ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడిందా? లేదా? అన్నది తెలుసుకోనున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలను ప్రత్యేకంగా సేకరించనున్నారు. ఈ సర్వేను పకడ్బందీగా చేయాలని కేసీఆర్ సర్వే సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. అంతేకాదు ఏ రకమైన ప్రశ్నలు వేసి ప్రజల నుంచి రాబట్టాలో ప్రత్యేకంగా ప్రశ్నావళిని రూపొందించి మరీ కేసీఆర్ సర్వే సంస్థకు ఇచ్చినట్లు సమాచారం. అలాగే సెటిలర్స్ మనోభావాలను కూడా ప్రత్యేకంగా ఈసర్వే ద్వారా తెలుసుకోనున్నారు. సర్వేతో పాటు ఇంటలిజెన్స్ నివేదికల ద్వారా ఎమ్మెల్యేల పనితీరును కేసీఆర్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఈ రెండింటినీ బేరీజు వేసుకున్న తర్వాత కేసీఆర్ టిక్కెట్ల పై ఒకనిర్ణయానికి వస్తారని గులాబీ పార్టీల నేతలు చెబుతున్నారు. మొత్తం మీద మూడో విడత సర్వే కేసీఆర్ చేయిస్తున్నారని తెలియడంతో ఎమ్మెల్యేల్లో దడ ప్రారంభమయింది.

Similar News