కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు సిద్ధమయ్యారు. రిజర్వేషన్ల కోటా పెంపుపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలను వ్యక్తం చేయడంతో ఎలాగైనా సాధించాలన్నది కేసీఆర్ లక్ష్యంగా ఉంది. తెలంగాణలో ముస్లిం, గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. దీనిపై ఇప్పటికే పార్లమెంటులో టీఆర్ఎస్ సభ్యులు ఆందోళనలు చేస్తున్నారు. కాని రిజర్వేషన్ల పెంపు విషయంలో కేంద్ర హోంశాఖ, సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖలు అభ్యంతరాలు తెలియజేయడంతో ఒత్తిడిని మరింత పెంచాలన్నది కేసీఆర్ ఆలోచన.
కేంద్రం అభ్యంతరాలు....
రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించుకోవడం కోసం ఒక పక్క పార్లమెంటులో ఆందోళనలు చేస్తూనే తాను స్వయంగా జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నారు. దీక్ష తాను స్వయంగా చేస్తే కేంద్ర ప్రభుత్వం కొంత దిగివస్తుందన్నది కేసీఆర్ ఆలోచన. అంతేకాకుండా దీనిపై న్యాయపోరాటం కూడా చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. మహారాష్ట్రలో 52 శాతం, తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలువుతుంటే తెలంగాణ విషయంలో కేంద్రం అభ్యంతరం ఎందుకు పెడుతుందని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు.
న్యాయపోరాటం కూడా....
తాము అన్ని రాష్ట్రాలలో అమలవుతున్న రిజర్వేషన్లను అమలును అధ్యయనం చేసిన తర్వాతే పక్కాగా బిల్లును రూపొందించామని కేసీఆర్ కు అధికారులు తెలిపారు. అయినా కూడా కేంద్రం అభ్యంతరాలు చెబుతుండటంతో కేసీఆర్ దీనిపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. కేంద్రం లేవెనెత్తిన అభ్యంతరాలకు ముందు సమాధానాలివ్వాలని అధికారులకు కేసీఆర్ సూచించారు. అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే తాను స్వయంగా జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తానని కేసీఆర్ అధికారులతో అన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కేసీఆర్ రిజర్వేషన్ల పెంపు బిల్లును సీరియస్ గా తీసుకున్నారు.