ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం వచ్చింది నిధులు, నీళ్లు, నియామకాలు... అయితే నియామకాల విషయంలో కేసీఆర్ సర్కార్ కొంత వెనకబడి ఉందనడం వాస్తవమే. ఈ విషయం గులాబీ పార్టీ నేతలకూ తెలియంది కాదు. ఇదే అంశంపై ఇటు జేఏసీ ఛైర్మన్ కోదండరామ్, బీజేపీ, కాంగ్రెస్ లు నిరుద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తూ వస్తున్నాయి. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఎన్నికల వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ వారి ఇంట్లో మాత్రం నలుగురికి కొలువులు ఇచ్చారన్న విమర్శలూ విన్పిస్తున్నాయి.
నిరుద్యోగులను సంతృప్తి పర్చేందుకు....
ఈ నేపథ్యంలో కేసీఆర్ నిరుద్యోగులను సంతృప్తి పర్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే తెలంగాణలో నిరుద్యోగులకు నెలకు రెండు వేల రూపాయలను నిరుద్యోగ భృతిని కల్పించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు విధివిధానాలను రూపొందించాలని కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమచారం. ఈ బడ్జెట్ లోనే నిరుద్యోగ భృతికి నిధులను కూడా కేటాయించాలని నిర్ణయించుకున్నారు. మార్చి నెలలో ప్రవేశపెట్టే బడ్జెట్ తుది బడ్జెట్ కావడంతో ఇందులోనే నిరుద్యోగులను సంతృప్తి పర్చే విధంగా చర్యలు ఉంటాయని తెలుస్తోంది.
కాంగ్రెస్ హామీని అమలు చేయాలని....
ఒకవైపు నోటిఫికేషన్లు తక్కువగా వస్తుండటంతో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు విపక్ష కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తాము అధికారంలోకి వస్తే రెండు వేల రూపాయలను నిరుద్యోగ భృతిని కల్పిస్తామని ప్రకటించింది. దీంతో కేసీఆర్ కాంగ్రెస్ ఇచ్చిన హామీని తానే అమలు చేయడానికి పూనుకుంటున్నారు. అయితే దీనిపై ఇప్పటికే ఆర్థిక శాఖ, విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. నిరుద్యోగులు అంటే ఎవరు? ఏ అర్హతులుండాలి? ఎందరు నిరుద్యోగులుంటారు? అనే లెక్కలు తేల్చే పనిలో పడ్డారు అధికారులు ఇందుకోసం గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలను పరిశీలిస్తున్నారు.
సుమారు 15 లక్షలమందికి లబ్ది....
అందిన సమాచారం ప్రకారం తెలంగాణలో దాదాపు 30 లక్షల నిరుద్యోగులు ఉన్నట్లు అధికారుల లెక్కల్లో తేలింది. వీరిలో ఉపాధి హామీ పథకం, నరేగా లాంటి పథకాలతో లబ్ది పొందుతున్న వాళ్లు ఇరవై లక్షల మంది వరకూ ఉండొచ్చు. ఇక మిగిలిన పదిలక్షల మంది చదువుకున్న నిరుద్యోగులు. వీరికి 30 సంవత్సరాలు లోపు ఉన్న వారు మరో ఐదు లక్షల మంది తోడవుతారని అంచనా. అంటే మొత్తం 15 లక్షల మందికి ఒక్కొక్కరికి నెలకు రెండువేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే నెలకు 300 కోట్ల రూపాయలు. ఏడాదికి 3,600 కోట్లు. వీరందరికీ జాబ్ కార్డులు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచన. పింఛన్ల తరహాలోనే వీరికి వారి ఖాతాల్లో జమచేయాలని ఆలోచిస్తున్నారు. దీనిపై కేసీఆర్ త్వరలోనే ప్రకటన చేసే అవకాశముందంటున్నారు.