ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఓ వ్యక్తి ఇప్పుడు తరచూ కన్పిస్తున్నారు. కేసీఆర్ వెంటే ఉండే ఈ వ్యక్తి ఎవరో పార్టీ నేతలకు అర్ధం కాక జుట్టు పీక్కుంటున్నారు. కేసీఆర్ మాత్రం అందరికీ ఆయనను తన సన్నిహితుడిగానే పరిచయం చేస్తున్నారు. కేసీఆర్ ఆయనకు ఇస్తున్న ప్రయారిటీ చూస్తుంటే ఎవరో ముఖ్యమైన వ్యక్తే అని అందరూ ఆయనకు కూడా తగిన గౌరవం ఇస్తున్నారు. సాధారణంగా ప్రగతి భవన్ లోకి వెళ్లాలంటే మంత్రులయినా ముందుగానే అపాయింట్ మెంట్ తీసుకోవాల్సిందే. కాని ఈయనకు మాత్రం ఎటువంటి అపాయింట్ మెంట్ అవసరం లేదు. నేరుగా ప్రగతి భవన్ లోకి వెళ్లే వీలుంది. అంతేకాదు సెక్యూరిటీ కూడా ఆయనను ఆపే సాహసం చేయరు. ఇంతకీ ఆయన ఎవరో కాదు. ఆయన పేరు నరసింహనాయుడు. విశాఖ జిల్లా మాడుగుల వాసి. ముఖ్యమంత్రి కేసీఆర్ కు చిరకాల మిత్రుడు. తెలుగుదేశం పార్టీలోనే ఆయనతో పరిచయం.
తెలుగు మహాసభల కోసమే.....
మాడుగులకు చెందిన నరసింహనాయుడికి తెలుగు భాష మీద బాగా పట్టుంది. పుస్తకాల పురుగు. కేసీఆర్ కూడా అంతేననుకోండి. ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్ లో జరగుతున్న నేపథ్యంలో నరసింహనాయుడి సహకారం కేసీఆర్ తీసుకుంటున్నారట. ఇటీవల గవర్నర్ నరసింహన్ ను కలిసేందుకు వెళ్లినప్పుడు కూడా కేసీఆర్ నరసింహనాయుడిని వెంటపెట్టుకుని వెళ్లారు. గవర్నర్ కు ప్రత్యేకంగా పరిచయం చేశారు. నరసింహనాయుడి ప్రత్యేకతలు గవర్నర్ కు వివరించారు. అయితే అధికారిక చర్చల్లో మాత్రం ఆయనను బయటకు పంపారనుకోండి. మొత్తం మీద సీఎం క్యాంప్ ఆఫీస్ లో నరసింహనాయుడు హాట్ టాపిక్ గామారారు. కేవలం తెలుగు మీద మమకారంతోనే కేసీఆర్ ఆయనను పిలిపించుకుని మాట్లాడుతున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.