‘‘నా చిన్న తనంలో మా నాన్నగారు అనేక పద్యాలు నేర్పించారు. అమ్మ ఒడిలోనే తొలి పద్యం...పాట నేర్చుకుంటాం. చనుబాలుతోనే తల్లి సాహిత్యం నేర్పిస్తుంది. శ్రీరాముడి దయ చేతను...అనే పద్యం నాకు ఇప్పటికీ గుర్తుకు వస్తుంది. నేను చిన్నతనంలో అయ్యవారి బడిలో చదువుకునేటప్పుడు నీతి కథలు చెప్పేవారు. మృత్యుంజయ శర్మ నాకు గురువు. ఆయన నాకు అక్షరాలు నేర్పారు. మాస్వగ్రామమానికి చెందిన స్వర్గీయ రాఘవరెడ్డి అనే ఉపాధ్యాయుడుఇంటిలో ఉండే చదువుకునే వాడిని. అక్కడ మృత్యుంజయ శర్మ ఉత్తర గోగ్రహణం చెప్పారు. ఎవరు ఖచ్చితంగా అప్ప జెబితే వారికి బహుమతి ఇస్తామన్నారు. పద్యాన్ని ఐదుసార్లు చదివి వెంటనే కంఠస్థం చేసి చెప్పాను. నన్ను వెంటనే ప్రధానోపాధ్యాయుడి వద్దకు తీసుకెళ్లి బహుమతి ఇప్పించారు. వెంటనే ఆయన రాఘవరెడ్డి వద్దకు తీసుకెళ్లి ఈ అబ్బాయికి సరస్వతీ కటాక్షం ఉందని, తన వద్దకు పంపమని మృత్యుంజయ శర్మ చెప్పారు. ఆ మరుసటి రోజు నుంచి నన్ను మృత్యుంజయ శర్మ నాలోని మెరుపును గమనించి రాయి లాంటి నన్ను సాన బెట్టారు. నేను రత్నం అయ్యానో లేదో నాకు తెలియదు కాని.. తొమ్మిదో తరగతిలోనే వృత్త పద్యాలు రాయడం ప్రారంభించా. ఆ ముద్ర ఇప్పటి వరకూ నామీద ఉంది. అలాంటి గురువులు ఉండబట్టే మన సాహిత్యానికి ఇంతటి గౌరవం ఉంది. సిద్ధపేట ఎంతో మంది సాహితీవేత్తలకు నిలయం. ఆ వాసన నాకూ తాకింది. నా చిన్న తనంలో హీరో శోభన్ బాబు సినిమా నేను చూశాను. పూతరేకులా...లేత సొగసును అన్న చరణం ఉంది. పూతరేకు అంటే నాకు అర్థం కాలేదు. సినిమా పాటల పుస్తకాన్ని కొని చదివాను.అందులో అదే ఉంది. గురువుగారిని అడిగితే పూతరేకులు కాకపోతే పూల రేకులు అనుకో అన్నారు. సందేహాన్ని తెప్పిస్తామని చెప్పి.. విజయవాడలో మిత్రుడికి లేఖ రాసి పూతరేకులంటే ఏంటని అడిగారు. పూతరేకులు ఒక స్వీటు పేరు. తెలంగాణ ప్రాంతంలో అప్పుడు లేదు. 1978 ప్రాంతంలో. పూతరేకులు అప్పుడు హైదరాబాద్ కు రాలేదు. ఆ ప్రాంతానికి చెందిన సినీ కవి రాశారు కాబట్టి. మా గురువు గారు నన్ను ఆలింగనం చేసుకుని నాకు కూడా తెలియని విషయం చెప్పావన్నారు. అలాంటి స్ఫూర్తి ఉన్న గురువులు కావాలి. ఇప్పుడు కూడా ఈ కృషి జరగాలి.’’ అని ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఆయన తన గురువైన మృత్యుంజయ శర్మకు పాదపూజ చేశారు.