అన్ని విషయాల్లోనూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఫాలో అయిపోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. తెలంగాణలో పది జిల్లాలను 31 జిల్లాలుగా కేసీఆర్ మార్చిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలోనూ జిల్లాల సంఖ్య పెంచాలని ఎమ్మెల్యేల నుంచి వత్తిడి పెరగడం, జిల్లాలు పెరిగితే అభివృద్ధి మరింత పెరుగుతుందని భావించడంతో చంద్రబాబు కూడా ఆ దిశగా యోచిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పదమూడు జిల్లాలున్న సంగతి తెలిసిందే. వీటి సంఖ్యను 26కు పెంచాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది.
త్వరలో ఏపీలో కొత్త జిల్లాలు....
ప్రస్తుతం ఉన్న జిల్లాను రెండు జిల్లాలుగా విభజించే యోచనలో చంద్రబాబు ఉన్నారు. సంక్రాంతికి కొత్త జిల్లాలను ప్రకటించే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమచారం. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళంతో పాటు పాలకొండ, విజయనగరం జిల్లాలో పార్వతీపురం, తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమ్రండి, అమలాపురం, పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరుతో పాటు తణుకు, గుంటూరు జిల్లాలో నర్సరావుపేట, పొన్నూరు, ప్రకాశం జిల్లాలో ఒంగోలు, కందుకూరు, కృష్ణా జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం, కర్నూలు జిల్లాలో కర్నూలు, నంద్యాల, విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం, అరకు, కడప జిల్లాలో కడప, పులివెందుల, అనంతపురం జిల్లాలో అనంతపురం, పుటపర్తి, చిత్తూరు జిల్లాలో చిత్తూరు, తిరుపతి ప్రాంతాలను జిల్లాలుగా చేయాలన్నది చంద్రబాబు యోచన.