కేసీఆర్ ను ఏకిపారేసిన కోదండరామ్

Update: 2017-10-07 12:30 GMT

తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. తనను కించ పర్చేవిధంగా మాట్లాడిన కేసీఆర్ మాటలను తెలంగాణ ప్రజలు గమనించారన్నారు. ఆయన భాషను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. అయతే తెలంగాణ కేసీఆర్ ఒక్కరి వల్లే రాలేదన్న విషయాన్ని మర్చిపోయి వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ ఏర్పడుతుందని భావించామని, అయితే జాగీర్దార్ పాలన రావడం బాధకల్గిస్తోందన్నారు. కొన్నేళ్ల పోరాటాలతో ఏర్పడిన తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోళ్లు ఉండవని అందరూ భావించామని, అయితే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కేసీఆర్ ప్రజాస్వామ్య స్ఫూర్తిని మంటగలిపారన్నారు.

ఇదా తెలంగాణ?

తెలంగాణ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మారారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయానికి వచ్చి ఎన్నిరోజులయిందో చెప్పాలని కోదండరామ్ నిలదీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తూ ప్రజా వ్యతిరేక చర్యలు చేపడుతున్నారని దుయ్యబట్టారు. దశాబ్దకాలాలపాటు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కేవలం ఒక కుటుంబం పాలయిందని, ఉద్యమంలో పాల్గొన్న వారందరూ ఇప్పుడు పనికిరాని వారిగా కేసీఆర్ కు మారిపోయారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఉద్యమ ద్రోహులతో దోస్తీ ఎందుకో కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రజా వ్యతిరేక పనులపై తమ పోరాటం ఆగదని కోదండరామ్ స్పష్టం చేశారు.

Similar News