కేసీఆర్ నిజం చెప్పేశారు

Update: 2018-03-28 04:30 GMT

రాజకీయ నాయకులు చేసే ప్రతి పని ఓట్ల కోసమే. ఆ విషయం బాహాటంగా అంగీకరించడానికి ఏ ఒక్కరు ఇష్టపడరు. కానీ విలక్షణ రాజకీయ నేత కేసీఆర్ మాత్రం మిగిలిన వారికి భిన్నం. అసెంబ్లీ సాక్షిగా ఇదే విషయాన్నీ అంగీకరించేశారు టి. సీఎం కేసీఆర్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ విపక్షాలు తాము చేసే సంక్షేమ కార్యక్రమాలు ఓట్ల కోసమే చేస్తున్నారంటూ చేస్తున్న ఆరోపణలను తనదైన శైలిలో ఖండిస్తూ కుండ బద్దలు కొట్టారు గులాబీ బాస్.

ఓట్ల కోసం కాక దేనికోసం చేస్తాం ...

రాజకీయాల్లో జరిగే ప్రతి నిర్ణయం ఓట్ల కోసమే. అలా చేయకపోతే ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుందన్నారు కేసీఆర్. తమ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలన్నీ ఎన్నికల్లో ఓట్లు పొందేందుకే చేశామని అది తప్పేలా అవుతుందని ఎదురుదాడి చేశారు టి బాస్. ప్రజాస్వామ్యంలో ప్రజలకు కావలిసింది చేయాలని, అలా చేసినప్పుడు ఓట్ల రాజకీయం అని ఎట్లా విమర్శిస్తారని విపక్షాలకు చురకలు వేశారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చర్చకు దారి తీసింది. ఏపీలో చంద్రబాబు ఏ సంక్షేమ పథకం మొదలు పెట్టినా ఓట్ల కోసం కాదంటారు. ఆయనే కాదు ప్రతి పార్టీ అదే విషయం చెబుతుంది. తాజాగా కేసీఆర్ రాజకీయ పార్టీలు తిప్పలు పడేది ఓట్ల కోసమే కనుక అవి వేసే వారిని వీలైనంత ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యమని తేల్చడం విశేషం.

Similar News