తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్న ఒక ఆర్టీసీ కండక్టర్ ను యాజమాన్యం సస్పెండ్ చేసింది. నిజామాబాద్ కు చెందిన సంజీవ్ ఆర్టీసీ కండక్టర్. ఇతను విధులు నిర్వహిస్తూనే ప్రభుత్వ పథకాలపై నెగటివ్ ప్రచారం చేస్తున్నారని ఆర్టీసీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. దీంతో కార్మికులు పెద్దయెత్తున ఆందోళనకు దిగుతున్నారు. వాక్ స్వాతంత్ర్యాన్ని అడ్డుకోవడమేనని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే సంజీవ్ పై వేసిన సస్పెన్షన్ వేటును తొలగించాలని, లేకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చిరిస్తున్నాయి కార్మిక సంఘాలు.
సంజీవ్ పై సస్పెన్షన్ వేటు.....
నిజామాబాద్ కు చెందిన సంజీవ్ కండక్టర్ గా పనిచేస్తూనే ప్రభుత్వ పథకాలను విమర్శిస్తూ పోస్టింగ్ లు పెడుతున్నారు. వామపక్ష అనుబంధ సంఘానికి చెందిన సంజీవ్ పై ఆర్టీసీ అధికారులకు స్థానిక టీఆర్ఎస్ నేతలు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఆర్టీసీ యాజమాన్యం సంజీవ్ పై ఛార్జిషీటు నమోదు చేసింది. రెండు రోజుల క్రితం సస్పెన్షన్ వేటు వేసింది. ఫేస్ బుక్, వాట్సాప్ లలో సంజీవ్ వేసిన పోస్టింగ్ లను ఆధారంగా చేసుకుని మాత్రమే తాము సస్పెండ్ చేశామని, ఆర్టీసీ యాజమాన్యానికి హాని కలిగించే విధంగా పోస్టింగ్ లు ఉండటం వల్లనే సస్పెండ్ వేటు వేశామంటున్నారు. మొత్తం మీద సంజీవ్ ప్రభుత్వానికి, కేసీఆర్ కు వ్యతిరేకంగా పోస్టింగ్ లు పెట్టడం వల్లనే సస్పెండ్ అయ్యారని, దీనిపై అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటున్నాయి కార్మిక సంఘాలు.