అవినీతిని సహించనంటూ కేసీఆర్ పదేపదే చెబుతుంటారు. కాని సొంత పార్టీ ఎమ్మెల్యేలే అవినీతికి పాల్పడినట్లు స్వపక్ష నేతలే విమర్శలకు దిగుతున్నారు. నామినేటెడ్ పోస్టులు కేసీఆర్ కు తలనొప్పిని తెస్తున్నాయి. నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తే కార్యకర్తలు, పార్టీకి కష్టపడి చేసిన వారు సంతృప్తి పడతారని భావిస్తే అందుకు విరుద్ధంగా నియోజకవర్గాల్లో జరగుతుండటం కేసీఆర్ ను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. నామినేటెడ్ పోస్టులను కేసీఆర్ ఎక్కువగా ఎమ్మెల్యేల సిఫార్సు మేరకే భర్తీ చేశారు. ఏ శాఖకు సంబంధించిన పోస్టులు ఆ శాఖ మంత్రి వద్దకు ఎమ్మెల్యే సిఫార్సు చేస్తేనే నియమించాలన్న ఆదేశాలు మంత్రులకు కేసీఆర్ ఇచ్చారు. అయితే గత రెండు రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు కేసీఆర్ కు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఎమ్మెల్యేల మీదనే సొంత పార్టీ నేతలు అవినీతి ఆరోపణలు చేయడం ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. ఒక పక్క విపక్షాలన్నీ ఏకమయి ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతుంటే మరోవైపు సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేల అవినీతి బయటపెట్టడం ఇబ్బందిగా మారింది. ఇటీవల మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మరో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డిపై జిల్లా కలెక్టర్లు ఆరోపణలు సద్దుమణగకముందే మరో ఇద్దరు ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు రావడం కేసీఆర్ కు మింగుడుపడని అంశమే.
ఇద్దరి ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు....
భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, స్పీకర్ మధుసూధనాచారిపై పరకాల మార్కెట్ యార్డు ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవి ఇవ్వడం కోసం స్పీకర్ కు తాను 48 లక్షల రూపాయలు ఇచ్చుకోవాల్సి వచ్చిందని ఆయన వాపోయారు. స్పీకర్ కుమారులు సయితం తనను పీడించుకు తింటున్నారన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ తన వద్ద ఉన్నాయన్న ఆయన స్పీకర్ భార్య అకౌంట్లో తాను డబ్బులు వేశానని చెప్పారు. దీనిపై స్పీకర్ ఇంతవరకూ స్పందించలేదు. ఇక నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మార్కెట్ యార్డు ఛైర్మన్ హన్మంతు చేసిన ఆరోపణలూ సంచలనం కలిగించేవే. తనకు మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవి కోసం ఎమ్మెల్యే వద్దకు వెళితే ముగ్గురు పోటీ పడుతున్నారని, పదవి కావాలంటే పదమూడు లక్షలు ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యే డిమాండ్ చేసినట్లు ఆయన బహిరంగ ఆరోపణ చేశారు. ఎమ్మెల్యే భార్య అకౌంట్లో తాను డబ్బులు వేశానని చెప్పారు. మంత్రి హరీశ్ రావు వద్దకు తనకు పదవి కావాలని వెళితే ఎమ్మెల్యే సిఫార్సు లేఖ కావాలని కోరగా తాను ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని సంప్రదించాల్సి వచ్చిందన్నారు. అయితే భూపాల్ రెడ్డి మాత్రం హనుమంతునుంచి తాను చేబదులు మాత్రమే తీసుకున్నానని చెప్పడం విశేషం. ఇలా ఎమ్మెల్యేలు నామినేటెడ్ పోస్టులు అమ్ముకుంటున్నారని, స్వపక్ష నేతలే విమర్శలకు దిగడంతో కేసీఆర్ సీరియస్ గా ఉన్నారట. అసలు అన్ని నామినేటెడ్ పోస్టుల్లో ఏం జరిగిందో తెలుసుకునే పనిలో పడ్డారట కేసీఆర్.