కేసీఆర్ చాలా టఫ్ నాయకుడు అనే సంగతి ఆయనతో కలిసి పనిచేసిన వారికి అందరికీ తెలుసు. ఆయన ఎంత టఫ్ ఉద్యమకారుడో.. గత యూపీఏ ప్రభుత్వం రుచిచూసింది. కాకపోతే.. సదరు కేసీఆర్ ‘టఫ్‌నెస్’ గురించి ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ కు ఇప్పుడే తెలిసిందా? తాను స్వయంగా మంత్రి అయి తండ్రి బాస్‌గా ఉన్న తెలంగాణ కేబినెట్ లో పనిచేయడం మొదలైన తర్వాత గానీ.. ఆయన టఫ్‌నెస్ కేటీఆర్‌కు తెలియలేదా అంటే అవుననే అనుకోవాలి. ఆయన తాజా ట్వీట్ లు అలాంటి అభిప్రాయాన్నే కలిగిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే.. కేటీఆర్ తెలంగాణ మంత్రిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి దేశాధినేతలతో కూడా ఎంతో అలవోకగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే అదే సమయంలో.. ఆయనకు టాలీవుడ్‌లో స్నేహబంధాలు చాలా ఎక్కువ. ప్రత్యేకించి నవతరం కుర్ర హీరోలు చాలా మంది కేటీఆర్‌కు దోస్తులు. వారిలో దగ్గుబాటి రానా కూడా ఉన్నారు.
రానా తాజాగా బాహుబలి 2 తర్వాత తండ్రి సురేష్ బాబు నిర్మాతగా తేజ దర్శకత్వంలో ఓ చిత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రానా చేస్తున్న తొలి చిత్రం ఇదే ఆ విషయాన్నే రానా తన తండ్రితో కలిసి ఉన్న ఫోటో తో సమా ట్విటర్‌లో షేర్ చేసుకున్నాడు. ‘ఈ నిర్మాత తో తొలిసారి చేస్తున్నా.. ఆయనే మానాన్న’ అంటూ అందులో పెట్టాడు.
ఆ ట్వీట్ కు స్పందించిన మంత్రి కేటీఆర్ ‘ నాదో చిన్న సలహా/హెచ్చరిక. తండ్రులు చాలా టఫ్ బాస్‌లుగా ఉంటారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉండొద్దు‘ అంటూ హెచ్చరించారు. రానా థాంక్యూ చెప్పేశాడు గానీ.. కేటీఆర్ స్పందన చూసిన వారు మాత్రం.. ‘‘తండ్రులు బాస్ లుగా చాలా టఫ్‌గా ఉంటారనే’’ సంగతి కేటీఆర్‌కు స్వానుభవంలో ఇప్పటికి అర్థమైనట్లున్నదని వ్యాఖ్యానిస్తున్నారు.