కేసీఆర్ - జానా మిలాఖ‌త్ లీక్ చేసిన సీనియ‌ర్‌

Update: 2017-12-10 09:30 GMT

పాలిటిక్స్ పోయి.. పాలి'ట్రిక్స్‌' జ‌రుగుతున్న నేటి కాలంలో నేత‌లు సెల్ప్‌గోల్ చేసుకోవ‌డం ఎక్కువైపోయింది. ఎవ‌రికి వారే గొప్ప అనుకునే రేంజ్ పెరిగిపోతోంది. ముఖ్యంగా తెలంగాణ వంటి కీల‌క రాష్ట్రంలో కాంగ్రెస్ నేత‌లు ఒక‌రిని మించి ఒక‌రు ఎలివేట్ అయ్యేందుకు తీవ్ర ప్రయ‌త్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక‌రి గురించి మ‌రొక‌రు పాత సంగ‌తులు త‌వ్వి మ‌రీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు తెగ క‌ష్టప‌డుతున్నారు. అది కూడా 2019 ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో ఈ వివాదాలు మ‌రింతగా పెరుగుతున్నాయి. అంత‌ర్గత ప్రజాస్వామ్యానికి పెద్ద పార్టీగా పేరున్న కాంగ్రెస్‌లో ఈ వివాదాలు తార‌స్థాయికి చేరుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం స‌హా రాష్ట్ర పార్టీ నేత‌లు తీవ్రంగా క‌ష్టప‌డుతున్నారు.

కాంగ్రెస్ దూకుడు పెంచుతున్న తరుణంలో....

ఈ క్రమంలోనే వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టు పార్టీలో చేర్చుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌, ఆయ‌న కుటుంబ రాజ‌కీయాలకు చెక్ పెట్టేలా కార్యాచ‌ర‌ణ కూడా జ‌రుగుతోంది. ఈ క్రమంలోనే అధికార పార్టీ టీఆర్ ఎస్ హ‌వాను సాధ్యమైనంత వేగంగా త‌గ్గించేందుకు కూడా ప్రయ‌త్నాలు చేస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్‌లో అంద‌రూ సీనియ‌ర్లు కావ‌డం కూడా పార్టీ పుట్టి ముంచుతోంద‌నేది విశ్లేష‌కుల మాట‌. ఎవ‌రికి వారే సీఎం సీటుపై క‌న్నేయ‌డం, లేదా దానికి త‌గిన స్థాయి ఉన్న అధికార పీఠాన్ని ద‌క్కించుకునేందుకు పావులు క‌దుపుతుండ‌డంతో త‌మ‌కు పోటీ వ‌స్తార‌ని భావిస్తున్న నేత‌ల‌పై సొంత పార్టీ నాయ‌కులు అని కూడా వెర‌వ‌కుండా పొగ పెడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వెలుగు చూసిన ఓ ఉదంతం.. కాంగ్రెస్ నేత‌ల తీరు మార‌దా? అనే ప్రశ్నకు అవ‌కాశం క‌ల్పిస్తోంది.

సర్వే సంచలన వ్యాఖ్యలు...

విష‌యంలోకి వెళ్తే.. ఎస్సీ వ‌ర్గానికి చెందిన మాజీ కేంద్ర మంత్రి స‌ర్వే స‌త్యనారాయ‌ణ కాంగ్రెస్‌లో సీనియ‌ర్ నేత‌. ఈయ‌నకు సీఎం పీఠంపై ఎప్పటి నుంచో ఆశ ఉంది. అంతేకాదు, గ‌తంలో ఆయ‌న అనుచ‌రుల‌తో 'కాబోయే సీఎం' అని కూడా నినాదాలు చేయించార‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శలు కూడా ఉన్నాయి. ఇవి అదిష్టానం దృష్టికి కూడా వెళ్లాయి. మ‌రోప‌క్క, టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేసిన ఓసీ వ‌ర్గానికి చెందిన జానా రెడ్డి కూడా సీనియ‌ర్ మోస్ట్ నేతే! ఈయ‌న కూడా ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుందా? ఎప్పుడెప్పుడు సీఎం సీటుకు పోటీ వ‌ద్దామా? అనే ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే స‌ర్వే స‌త్యనారాయ‌ణ త‌న‌కు పోటీ వ‌స్తాడ‌ని అనుకున్న ప్రతి నేత‌పైనా ఇటీవ‌ల కాలంలో విమ‌ర్శలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా జానాను టార్గెట్ చేసిన స‌ర్వే.. పాత సంగ‌తులు త‌వ్వి తీశారు. జానా ఇమేజ్‌కు డ్యామేజీ క‌లిగించేలా వ్యాఖ్యానించారు.

జానా....కేసీఆర్ ఇలా....

జానా.. టీఆర్ ఎస్ అధినేత‌తో మిలాఖ‌త్ అయ్యారంటూ వ్యాఖ్యలు గుప్పించారు. ఇంత‌కీ స‌ర్వే ఏమన్నారంటే.. '‘తెలంగాణ ఉద్యమ సమయంలో జానారెడ్డి.. జేఏసీ అంటూ కేసీఆర్‌ను కౌగిలించుకున్నారు. ఆ అమాయకత్వాన్ని అదునుగా తీసుకొని కేసీఆర్ సీఎం అయ్యారు. కాంగ్రెస్ వస్తే నీవు సీఎం.. టీఆర్‌ఎస్ వస్తే నేను సీఎం అని.. జానారెడ్డి, కేసీఆర్ అనుకున్నట్లు ఉన్నారు’ అని సర్వే చెప్పుకొచ్చారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకల సంద‌ర్భంగా స‌ర్వే ఈ వ్యాఖ్యలు చేయ‌డం మీడియా స‌హా కాంగ్రెస్ నేత‌ల‌ను నివ్వెర ప‌రిచింది. ఇన్‌డైరెక్ట్‌గా జానా.. కేసీఆర్‌కు మిత్రుడేన‌ని, ఎప్పటికైనా ఆయ‌న‌తో ప్రమాద‌మ‌ని చెప్పుకొచ్చే ప‌నిలో భాగంగానే స‌ర్వే ఈ వ్యాఖ్యలు చేశార‌ని అంటున్నారు. విశ్లేష‌కులు.

Similar News