కేసీఆర్ కు పవన్ ఫిదా అయింది ఇందుకేనా?

Update: 2018-01-02 03:30 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏం మాట్లడతారో తెలియదు. ఆయన మూడ్ ను బట్టి మనసులోనుంచి మాటలు తన్నుకొస్తుంటాయి. ఒకసారి తిడతారు. మరోసారి పొగుడుతారు. ఇటీవలే ఓయూ లో విద్యార్థి ఆత్మహత్యపై పవన్ నెగిటివ్ స్పందనను మనం విన్నాం.... చూశాం... కాని ఉన్నట్లుండి పవన్ కేసీఆర్ కు ఫిదా అయిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్తును ఇస్తుండటం చూసి ఆయన ఆశ్చర్య పోయారు. పత్రికల్లో ఈ వార్తను చూసిన పవన్ ఇక తట్టుకోలేక కేసీఆర్ ను కలిసేందుకు బయలుదేరారు.

స్వరం మారింది....

పవన్ కల్యాణ‌్ ఒక పార్టీకి అధినేత. రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. అయితే ఉన్నట్లుండి ఆయన కేసీఆర్ ను కలవడం ఆశ్చర్యకర పరిణామమే. తెలంగాణలో తనకు అభిమానులున్నారని, తాను ఇక్కడ వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నట్లు కూడా పవన్ ప్రకటించారు. కాని కేసీఆర్ ను కలిసిన తర్వాత పవన్ స్వరం మారింది. తెలంగాణను అభివృద్ధి పథంలో కేసీఆర్ తీసుకువెళుతున్నారని పవన్ ప్రకటించారు. టీఆర్ఎస్ సర్కార్ చక్కగా పనిచేస్తుందని కితాబిచ్చారు.

పరోక్షంగా ఏపీకి చురకలు....

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఎలా సాధ్యమైందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే అంధకారం అవుతుందన్న వారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనాసామర్థ్యం భేషుగ్గా ఉందని చెప్పారు. దాదాపు అరగంట సేపు కేసీఆర్ తో భేటీ అయిన పవన్ కల్యాణ్ వివిధ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కూడా 24 గంటల ఉచిత విద్యుత్తును ఒక మోడల్ గా తీసుకుని స్టడీ చేసి అక్కడ కూడా అమలుపర్చాలని డిమాండ్ చేశారు. అసాధ్యమనుకున్న ఎన్నో విషయాలను కేసీఆర్ సుసాధ్యం చేశారని పవన్ తెగ పొగిడేసి వెళ్లిపోయారు. కేసీఆర్ ను కలిసేందుకు ప్రగతి భవన్ లో పవన్ దాదాపు గంటసేపు నిరీక్షించారు.

Similar News