కేసీఆర్ ఇక డిసైడ్ అయిపోయారు...!

Update: 2017-12-30 03:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక నిశ్శబ్దాన్ని వీడనున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ఒకవైపు జిల్లాల వారీగా సభలు పెట్టి అధికార పార్టీపై విరుచుకుపడుతుంటే ఆ విమర్శలను తిప్పికొట్టలేక మంత్రులు అవస్థలు పడుతున్నారు. దీంతో ఇక కేసీఆర్ జిల్లాల వారీగా సభలను ప్లాన్ చేయాలని ఆదేశించారు. తెలంగాణలోని ప్రతిజిల్లాలో సభ జరపాలని, రెండు లక్షల మంది జనాన్ని సమీకరణ చేయాలని లక్ష్యాన్ని విధించారు.

దూకుడు పెంచిన కాంగ్రెస్....

ఇటీవల కాంగ్రెస్ పార్టీ జిల్లాల వారీగా సభలను ఏర్పాటు చేస్తూ దూసుకెళుతోంది. కోస్గి, జడ్చర్లలో కాంగ్రెస్ పెట్టిన సభలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు వచ్చే నెలలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా తీసుకొచ్చి వరంగల్ లో సభ పెట్టాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. అయితే ఇప్పటి వరకూ కాంగ్రెస్ సభల్లో చేసే విమర్శలను మంత్రులు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు.

జిల్లాల వారీగా సభలు....

ఈ నేపథ్యంలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో జిల్లాల వారీగా సభలను ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. తెలంగాణలోని 31 జిల్లాల సభలకు తాను హాజరవుతానని కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పడంతో వాటి షెడ్యూల్ ను తయారు చేసేపనిలో గులాబీనేతలు బిజీగా ఉన్నారు. ప్రభుత్వ పథకాలు ఎన్ని అమలు చేస్తున్నప్పటికీ అవి సక్రమంగా ప్రజల్లోకి వెళ్లడం లేదని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యేలు సయితం ప్రజల్లోకి పథకాలను తీసుకెళ్లలేకపోతున్నారు.

ప్రభుత్వ పథకాలను వివరించేందుకు....

దీంతో తానే జిల్లాలకు వెళితే అభివృద్ధి పనులతో పాటు విపక్ష కాంగ్రెస్ పై కూడా విరుచుకుపడే అవకాశముంటుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేశారు. అయితే కేసీఆర్ అన్ని జిల్లాలను పర్యటించలేకపోయారు. ప్రగతి భవన్ లోనే ఎక్కువగా సమీక్షలు చేస్తున్నారు. అన్ని జిల్లాలు తిరిగితే ఆ జిల్లాకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేశామో సవివరంగా చెప్పే వీలుంటుంది. అందుకే కేసీఆర్ త్వరలోనే జిల్లాల బాట పట్టనున్నారు. కొత్త ఏడాది ఈ పర్యటన ఉంటుందని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Similar News