కేటీఆర్ కు తొడగొడుతున్న లోకేష్ ...!

Update: 2017-11-24 05:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ కు తొడకొడుతున్నారు ఏపీ సీఎం తనయుడు నారా లోకేష్. అదేంటి అంటే ... టి మంత్రి వర్గంలో కీలకమైన ఐటి శాఖను కేసీఆర్ తన పుత్ర రత్నానికి కట్టబెట్టారు. వాటితో పాటు పలు కీలక శాఖలను కేటీఆర్ నిర్వహిస్తున్నా ఐటి శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఆయన. ఉపాధి అవకాశాలు మెండుగా వున్న రంగం కావడం, ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్ విద్యకు డిమాండ్ వున్న నేపధ్యం హైదరాబాద్ కి వున్న అనుకూలతలు కేటీఆర్ కి కలిసి వచ్చాయి. దాంతో బాటు కేటీఆర్ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు పర్యటించి పెట్టుబడులు వెల్లువలా భాగ్యనగరానికి తరలివచ్చేలా కృషి చేస్తున్నారు. ఇవన్నీ కేటీఆర్ కి తెలంగాణ లో మంచి మైలేజ్ తెచ్చి పెడుతున్నాయి.

బాబు ఆ శాఖే ఇచ్చారు ...

సుపుత్రుడిని షైన్ చేయాలంటే ఐటి శాఖకు మించింది లేదని చంద్రబాబు భావించారు. ఎమ్యెల్సీని చేసి మంత్రిని చేశాక కుమారుడికి ఈ ఐటి శాఖ చేతిలో పెట్టి నీ సత్తా చూపించు అన్నారు బాబు. పంచాయితీరాజ్ వంటి కీలక శాఖతో ఐటి శాఖామంత్రి బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ కేటీఆర్ కన్నా మంచి మార్కులు సాధించాలని తాపత్రయ పడుతున్నారు.

లక్ష ఐటి ఉద్యోగాల కల్పన టార్గెట్ గా ...

ఏపీలో ఉపాధి అవకాశాలు మెండుగా పెరగాలంటే ఐటి రంగాన్ని మించింది లేదని లోకేష్ గుర్తించారు. పక్క రాష్ట్రంలో కేటీఆర్ తన సామర్ధ్యంతో దూసుకుపోతుంటే బాబు తనయుడు దూకుడు పెంచారు. అమరావతి పరిధిలోని గన్నవరం కేంద్రంగా ఐటి హబ్ కి రంగం సిద్ధం చేస్తున్నారు లోకేష్. తాను మంత్రి పదవి చేపట్టిన వెంటనే 13 వేల ఉద్యోగాలు ఐటీరంగంలో సాధించగలిగామని లక్ష ఉద్యోగాలు లక్యంగా వచ్చే రెండేళ్లు సాగిపోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ లక్ష్యాన్ని రెండేళ్లలో ఖచ్చితంగా అందుకుంటా అని విశాఖ, తిరుపతి, అమరావతి కేంద్రాలుగా ఐటిని విస్తరిస్తామంటున్నారు లోకేష్. మరి లోకేష్ బాబు రెండేళ్లలో తన లక్ష ఉద్యోగాల టార్గెట్ చేరుకుంటారో లేదో చూడాలి .

Similar News