తెలంగాణ మంత్రి కేటీఆర్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిలో పయనింపచేసేందుకు విదేశీయాత్రలు చేస్తున్నారు. ఆయన మంత్రిగా చేపట్టిన తర్వాత వివిధ దేశాలను చుట్టివచ్చారు. ఎన్నో రకాల పెట్టుబడులను తెలంగాణకు తెచ్చేందుకు కృషి చేశారు. ముఖ్యంగా ఐటీ రంగంలో ఆయన అనేక కంపెనీలను తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తీసుకువచ్చి ప్రముఖుల ప్రశంసలనూ అందుకున్నారు. ప్రస్తుతం కేటీఆర్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఆయన తెలంగాణకు మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పర్యటన చేపట్టారు.
దక్షిణ కొరియాలో పర్యటన...
అయితే కేటీఆర్ దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్ నుంచి డ్యాగు పట్టణానికి హైస్పీడ్ ట్రెయిన్ లో పర్యటించారు. ఈ హైస్పీడ్ రైలు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. భారత్ లోని రెండు ప్రధాన నగరాలకు ఈ రైలు అవసరం ఎంతో ఉందని కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనివల్ల గంటల కొద్దీ సమయం ఆదా అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వైఫై అనుసంధానిత రైళ్లు భారత్ కు కూడా రావాల్సి ఉందని ఆయన ట్వీట్ చేశారు. ఈ రైలు 417 కిలోమీటర్ల దూరాన్ని కేవలం రెండు గంటల పది నిమిషాల్లోనే చేరుకుందన్నారు.
వరంగల్ టెక్స్ టైల్ పార్కు కోసం....
దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా వరంగల్ లో ఇటీవల ప్రారంభించిన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో పెట్టుబడుల కోసమేనని కేటీఆర్ తెలిపారు. అక్కడి పెట్టుబడుదారులకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇండ్రస్ట్రియల్ రిఫార్మ్స్ గురించి వివరించారు. వస్త్ర తయారీ రంగంలో పెట్టుబడులకు వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు అనుకూలమని వారికి వివరించారు. దీంతో పాటు డ్యాగు పట్టణంలోని వ్యాపార ప్రతినిధులతోనూ కేటీఆర్ సమావేశమై పెట్టుబడుల ఆవశ్యకతను వారికి వివరించారు.