కేజ్రీకి ‘‘ఆప్‘‘ సోపాలు తప్పడం లేదే

Update: 2018-03-13 20:30 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు షాక్ లు మీద షాక్ లు తగులుతున్నాయి. ఇటీవల ఢిల్లీ చీఫ్ సెక్రటరీపై ఆప్ ఎమ్మెల్యేలు దాడిచేసిన సంఘటన మరువక ముందే ఆయన వ్యక్తిగత సలహాదారుడు రాజీనామా చేయడం ఆప్ పార్టీకి కోలుకోలేని దెబ్బేనంటున్నారు. వ్యక్తిగత సలహాదారుడిగా వీకే జైన్ ను కేజ్రీవాల్ నియమించుకున్నారు. ఆయన పదవికి రాజీనామా చేశారంటే కేజ్రీవాల్ సమర్థత, నాయకత్వంపై అనుమానాలు కల్గిస్తున్నాయని విపక్షాలు ఎదురుదాడికి దిగుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ ఒంటెత్తు పోకడలకు ఇది నిదర్శనమని చెబుతున్నారు.

సొంత పార్టీలో విభేదాలు.....

ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టిందే అవినీతికి వ్యతిరేకంగా, సామాన్యుడి సమస్యలను పరిష్కరించడానికేనన్నది అందరికీ తెలిసిందే. అందుకే రెండోసారి జరిగిన ఎన్నికల్లో ఆప్ కు ఢిల్లీ ప్రజలు ఘన విజయం సాధించిపెట్టారు. అయితే కేజ్రీవాల్ సర్కార్ వరుస వివాదాల్లో చిక్కుకోవడం కూడా చికాకు తెప్పిస్తుందంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలోనూ విభేదాలు భగ్గుమన్నాయి. ఆప్ నేతలు వీధిన పడ్డారు. కేజ్రీవాల్ పైనే అవినీతి ఆరోపణలు చేశారు. ఈనేపథ్యంలో కేజ్రీవాల్ వ్యక్తిగత సలహాదారుడు వీకే జైన్ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.

వ్యక్తిగత కార్యదర్శి రాజీనామాతో.....

ఢిల్లీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అన్షు ప్రకాశ్ పై దాడి జరిగిన సమయంలో కేజ్రీవాల్ వ్యక్తిగత సలహాదారుడు వీకే జైన్ అక్కడే ఉన్నారు. ఆయన చూస్తుండగానే ఆప్ ఎమ్మెల్యేలు చీఫ్ సెక్రటరీపై దాడికి తెగబడ్డారన్న కథనాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో వీకే జైన్ దాడి జరిగిన మాట వాస్తవమేనని, తాను చూస్తుండగానే ఎమ్మెల్యేలు చీఫ్ సెక్రటరీపై దాడి చేశారని సాక్ష్యం చెప్పడం సంచలనం కల్గించింది. వీడీయో ఫుటేజీలు కూడా మాయం కావడం అనుమానాలను మరింత పెంచింది. దీనిపై రెండు రోజుల క్రితం వీకే జైన్ ను పోలీసులు విచారించారు. దీంతోనే ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

Similar News