కేజ్రీ వాల్ క్రేజీ డెసిషన్...!

Update: 2017-12-30 17:30 GMT

గ‌త కొన్నాళ్లుగా కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరుగుతున్న ఢిల్లీ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ నేత సీఎం కేజ్రీవాల్ స‌రికొత్త, సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టి వ‌రకు తమ‌కు పూర్తిస్థాయిలో అధికారాలు ఇవ్వాలంటూ కేంద్రంపై యుద్ధం చేస్తున్న కేజ్రీవాల్.. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ హ‌వాకు బ్రేక్ ప‌డేందుకు త‌న ప్ర‌య‌త్నాలు తాను చేస్తున్నారు. అయినా కూడా ఢిల్లీపై కేంద్రం మాత్రం క‌నిక‌రించ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే కేజ్రీవాల్ మ‌రింత దూకుడుగా కేంద్రంపై పోరు చేసేందుకు త‌న‌కున్న రాజ్య‌స‌భ అస్త్రాన్ని వినియోగించుకోవాల‌ని నిర్ణ‌యించారు. ప్ర‌స్తుతం కేజ్రీవాల్‌కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య‌ను బ‌ట్టి దాదాపు మూడు రాజ్య స‌భ టిక్కెట్లు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఇద్దరిని ఎంపిక చేసి...

దీంతో కేజ్రీవాల్ ఇప్ప‌టి వ‌ర‌కు ఇద్ద‌రిని పెద్ద‌ల స‌భ‌కు ప్ర‌మోట్ చేయాల‌ని నిర్ణ‌యించారు.వీరిలో త‌న‌కు అత్యంత స‌న్నిహితులు, పార్టీకి విధేయులు అయిన‌ ఆశుతోష్‌, సంజయ్‌ సింగ్‌ల పేర్లును ఆ పార్టీ పరిశీలిస్తున్నారు. దాదాపు వీరి పేర్లే ఖరారు అయ్యే అవకాశం ఉంది. ఇక మూడో అభ్యర్థి విషయంలోనే కేజ్రీవాల్ సందేహంలో ప‌డ్డారు. తొలుత ఈ సీటును ఒక ప్రొఫెసర్ కేటాయించాల‌ని నిర్ణ‌యించారు. అయితే దీనిని అందుకునేందుకు ఎవ‌రూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తానే మూడో అభ్యర్థిగా పోటీ చేయాలనే భావనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇలా చేయ‌డం వ‌ల్ల కేంద్రంపై ప్ర‌త్య‌క్షంగా పోరాడేందుకు రాజ్య‌స‌భ వేదిక‌గా త‌న‌కు మంచి అవ‌కాశం చిక్కుతుంద‌ని కేజ్రీ భావిస్తున్నార‌ని తెలుస్తోంది.

తానే రాజ్యసభకు వెళ్లాలని....

రాజ్య‌స‌భ‌లో అయితే, కేంద్రం త‌ప్ప‌కుండా త‌న‌కు స‌మాధానం చెప్పితీరాల్సిన ప‌రిస్తితి వ‌స్తుంద‌ని, త‌ప్పించుకునే ఛాన్స్ కూడా ఉండ‌ద‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే రాజ్య‌స‌భ‌ను ఎంచుకోవాల‌ని ప్రాథ‌మికంగా నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఒక‌వేళ‌.. తాను కాకుండా ఎవ‌రినైనా పంపాల‌ని నిర్ణ‌యిస్తే.. మూడో అభ్యర్తిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ను నిలబెట్టేందుకు ఆప్‌ ఆసక్తి చూపింది. ఈ విషయంపై ఠాకూర్‌తో కేజ్రీవాల్‌ ప్రత్యేకంగా సమావేశమ్యారు. ఈ సమావేశంలోనే ఆప్‌ సూచనను ఠాకూర్‌ సున్నితంగా తిరస్కరించిన‌ట్టు తెలుస్తోంది.

అందరూ నో అనడంతో...

ఇక‌, మాజీ ఆర్బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌, మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా, మాజీ కేంద్ర మంత్రి అరుణ్‌ శౌరి, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు ఆర్‌ నారాయణ మూర్తి, నోబెల్‌ అవార్డు గ్రహీత కైలాష్‌ సత్యార్థిలను కూడా ఆప్‌ సంప్రదించింది. అయితే వారంతా రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఇక మూడో అభ్యర్థిగా తానే పోటీ చేయాలని అరవింద్‌ కేజ్రీవాల్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే, మ‌రో రెండేళ్ల‌లో మ‌ళ్లీ డిల్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మ‌రి దీనిని ఎదుర్కొనేందుకు కేజ్రీ అప్పుడేం చేస్తార‌నే ప్ర‌శ్న‌లు కూడా ఉత్ప‌న్నం అవుతున్నాయి. మ‌రి ఏం చేస్తారో చూడాలి. ఏదేమైనా.. కేజ్రీ నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

Similar News