కేజ్రీ... టైం బాగోలేదా?

Update: 2018-02-20 16:30 GMT

ఆయన ఉన్నతాధికారిగానే పనిచేసి ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నో పోరాటాలు చేశారు. ఉద్యమాలు నిర్వహించారు. అవినీతికి వ్యతిరేకంగా నడుంబిగించారు. ఆయనముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఆయనే.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్. ఇప్పుడు ఆయన గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చందంటే...ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై దాడి జరగడం గమనార్హం. తొలినుంచి కేజ్రీవాల్ ప్రభుత్వానికి అధికార యంత్రాంగం సహకరించడం లేదని ఆయన ఆరోపిస్తూనే ఉన్నారు. లెఫ్ట్ నెంట్ గవర్నర్ చెప్పినట్లే నడుచుకుంటున్నారని, తాము చట్ట సభలో ఎన్ని శాసనాలు చేసినా అమలుకు నోచుకోవడం లేదన్నది కేజ్రీవాల్ వాదన.

సరుకులను ఇంటికే చేర్చే పథకంపై.....

అయితే ఈ పరిస్థితుల్లో ప్రజాపంపిణీ వ్యవస్థలో ఇంటింటికీ సరుకులను అందించాలని కేజ్రీవాల్ నిర్ణయించారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలోనే ఇంటింటికీ సరుకులను పంపిణీ చేసి అందులో లొసుగులను అరికట్టాలని కేజ్రీవాల్ భావించారు. ఈ కార్యక్రమాన్ని వీలయినంత త్వరగా ప్రారంభించాలనుకున్న కేజ్రీవాల్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్ ను పిలిచారు. చీఫ్ సెక్రటరీ హాజరైన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు, చీఫ్ సెక్రటరీకి మధ్య మాటల యుద్ధం జరిగినట్లు సమాచారం.

వాగ్వాదం పెరిగి.....

ప్రజాపంపిణీవ్యవస్థను ప్రజల ఇళ్ల వద్దకే తీసుకెళ్లాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల డిమాండ్ పై ఆయన కొర్రీలు వేయడంతో కొంత వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ఆయన తాను లెఫ్ట్ నెంట్ గవర్నర్ కే జవాబుదారీగా ఉంటానని చెప్పడంతో ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు చీఫ్ సెక్రటరీపై దాడికి పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సమావేశంలో ఎవరిపై ఎలాంటి దాడులు జరగలేదని, కావాలంటే వీడియో ఫుటేజీని విడుదల చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది. అయితే చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాశ్ మాత్రం తనపై దాడి జరిగినట్లు ఐఏఎస్ అధికారులరకు ఫిర్యాదు చేశారు.

ఐఏఎస్ ల నిరసన....

అన్షు ప్రకాశ్ ఫిర్యాదు మేరకు ఐఏఎస్ అధికారులు సమావేశమై సామూహిక నిరసనలకు దిగాలని నిర్ణయించారు. తాము విధులకు హాజరైనా పెన్ డౌన్ చేస్తామని ప్రకటించారు. దాడి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేంత వరకూ తమ నిరసనలు ఆగబోవని ఐఏఎస్ అధికారుల సంఘం నేత డీఎన్ సింగ్ తెలిపారు. ఈ మేరకు వారు లెఫ్ట్ నెంట్ గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అయితే ఇది బీజేపీ కుట్ర అని, బీజేపీ ఆడిస్తున్నట్లే అధికారులు ఆడుతున్నారని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అధికారులు పక్కన పెడుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. మొత్తం మీద ఢిల్లీలో ఐఏఎస్ ల నిరసనలతో పాలన స్థంభించిందనే చెప్పొచ్చు.

Similar News