పాపం.. డీఎస్.. ఒక పక్క రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు పార్టీలో పుంజుకుంటుంటే... డి. శ్రీనివాస్ ను మాత్రం పార్టీ పూర్తిగా పక్కన పెట్టేసిందనే చెప్పాలి. డి.శ్రీనివాస్ మీద కుమారుడు ఎఫెక్ట్ పడిందనే చెప్పాలి. డిఎస్ తనయుడు అరవింద్ కాషాయ పార్టీలో చేరడంతో ఆయనకు కేసీఆర్ వద్ద మైనస్ మార్కులు పడిపోయాయి. కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన డి.శ్రీనివాస్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. మంత్రిగానూ పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం డీఎస్ అధికార టీఆర్ఎస్ లోకి చేరిపోయారు. డీఎస్ ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి కేసీఆర్ ఆయనకు గౌరవంగా కేబినెట్ ర్యాంకున్న సలహాదారు పదవి కట్టబెట్టారు. వెను వెంటనే రాజ్యసభ స్థానాన్ని ఇచ్చారు. అయితే డీఎస్ మాత్రం తనకు ఎన్ని పదవులిచ్చినప్పటికీ సొంత జిల్లాపై మమకారం పోలేదు. సొంత జిల్లాల్లో పార్టీపై పట్టుకోసం అనేక ప్రయత్నాలు చేశారు. కాని సఫలం కాలేదు.
సొంతజిల్లాలో అవమానాలు...
డీఎస్ కు సొంత జిల్లాలోనే నేతలు మాట వినని పరిస్థితి ఏర్పడింది. ఆ జిల్లాలో అప్పటికే అక్కడ కేసీఆర్ కుమార్తె కవిత ఉండటంతో కవిత వైపే నేతలు మొగ్గు సహజంగానే చూపారు. తన పెద్దకుమారుడు సంజయ్ ను ఎమ్మెల్యేగా చేయాలని భావిస్తున్న డీఎస్ కు అది కుదిరేటట్లు కన్పించలేదు. దీంతో ఆయన కాంగ్రెస్ లోకి తిరిగి వెళతారన్న ప్రచారం అప్పట్లో జోరుగా జరిగింది. ఈ ప్రచారాన్ని డీఎస్ అప్పుడప్పుడూ ఖండించినా కేసీఆర్ కు ఉన్న సమాచారం మేరకు ఆయన కాంగ్రెస్ ముఖ్యనేతలతో చర్చలు జరిపినట్లు సమాచారం అందింది. దీంతో డీఎస్ ను కొంత కేసీఆర్ పక్కన పెట్టేశారు. ఆ తర్వాత డీఎస్ మరో కుమారుడు అరవింద్ బీజేపీలో చేరడంతో కేసీఆర్ ఆయనను పూర్తిగా పక్కన పెట్టేశారు. డీఎస్ కు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది.
కేకేకు దక్కుతున్న గౌరవం....
ఇక మరో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకూడా మియాపూర్ భూముల వివాదంలో చిక్కుకుకున్నప్పుడు కేసీఆర్ కు, ఆయనకు మధ్య మనస్పర్థలు వచ్చాయి. అక్రమంగా కొనుగోలు చేసిన భూములను వెంటనే తిరిగి ప్రభుత్వ పరం చేయాలని కేసీఆర్ బహిరంగంగా చెప్పారు. కేకే కూడా ఒక దశలో ప్రభుత్వానికి ఎదురు తిరిగే విధంగా మాట్లాడారు. న్యాయస్థానంలో ఉన్న అంశంపై ప్రభుత్వ జోక్యం ఏంటని ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ కావడంతో ఆయన దిగివచ్చి తాను కొనుగోలు చేసిన భూములను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వివాదం సమసి పోయింది. ఆ తర్వాత టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ బాధ్యతలను కూడా కేసీఆర్ అప్పగించారు. పార్టీ కార్యక్రమమైనా, ప్రభుత్వ కార్యక్రమమైనా కేకేకు ఇప్పటికీ కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కాని డీఎస్ మాత్రం ఏ కార్యక్రమంలోనూ కన్పించడం లేదు. ఒకే పార్టీ నుంచి వచ్చిన ఈ ఇద్దరు నేతల్లో ఒకరు పార్టీలో దూసుకెళుతుండగా, మరొకరు డీలా పడ్డారు.