నరసరావుపేట నియోజకవర్గంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. నరసరావుపేట కోడెల శివప్రసాదరావుకు ఒకప్పుడు పట్టున్న నియోజకవర్గం. వచ్చే ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పై నేరుగా ధ్వజమెత్తిన జగన్ నరసరావుపేట వచ్చేసరికి ఆయన పరోక్షంగా విమర్శలుచేశారు. ఆయన ప్రసంగం మొత్తం స్పీకర్ కోడెల శివప్రసాదరావు చుట్టూ తిరిగినట్లే కన్పించినా ఆయన పేరును మాత్రం ప్రస్తావించకపోవడం విశేషం.
టీఎస్టీ అంటే అర్థం చెప్పారు గాని....
నరసరావుపేటలో జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ నరసరావుపేటలో వ్యాపార వర్గాలు, చిరు వ్యాపారులు జీఎస్టీతో బాధపడుతున్నారన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీకి తోడుగా ఇక్కడ టీఎస్టీ, కేఎస్టీ అమలువుతందన్నారు. టీఎస్టీ అంటే తెలుగుదేశం సర్వీస్ ట్యాక్స్ గా జగన్ చెప్పుకొచ్చారు. జన్మభూమి కమిటీలు నుంచి ప్రాజెక్టుల వరకూ తెలుగుదేశం సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తుండటంతో వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రజలను ఈవిధంగా అడ్డంగా దోచుకుంటున్నా ప్రభుత్వం మాత్రం తమ హయాంలో అవినీతి లేదని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
పరోక్ష విమర్శలు చేశారా?
అదే సమయంలో కేఎస్టీ అంటే ఏంటో జగన్ చెప్పలేదు. నరసరావు పేట నియోజకవర్గంలో కేఎస్టీ ని కూడా ప్రజలు చెల్లించాల్సి వస్తుందన్న జగన్, రైల్వే కాంట్రాక్టుల దగ్గర నుంచి విద్యుత్తు ప్రాజెక్టుల వరకూ, కోటప్పకొండ కాంట్రాక్ట్ నుంచి మద్యం కాంట్రాక్టుల వరకూ, చివరకు కొత్త సినిమా రిలీజయినా కేఎస్టీ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుందని తీవ్ర విమర్శలు చేశారు. టీఎస్టీ, కేఎస్టీల పేరుతో ప్రజలను అడ్డంగా దోచుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. నరసరావుపే నియోజకవర్గంలో ఇప్పటికీ పెత్తనం ఎవరదేనిది అక్కడ ప్రజలకు తెలిసి ఉండటంతో జగన్ కేఎస్టీకి అర్థం చెప్పకుండానే తన ప్రసంగాన్ని ముగించేశారు. కాని కేఎస్టీ అంటే అక్కడి ప్రజలకు అర్థమై నవ్వుకోవడం కన్పించింది.