పత్తికొండ నియోజకవర్గం. ఇక్కడి నేతల పట్టే వేరు. కర్నూలు ఎమ్మెల్సీ స్థానానికి కేఈ సోదరుల్లో ఒకరైన కేఈ ప్రభాకర్ ను ఎంపిక చేయించడంతో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి గట్టిగానే పట్టుబట్టి నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ స్థానానికి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలన్నది టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచన. రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉండటంతో పాటు కొన్నాళ్లుగా ఈ స్థానం అదే సామాజిక వర్గానికి ఇస్తుండటం ఆనవాయితీగా వస్తుంది. ఫైనల్ గా చల్లా రామకృష్ణారెడ్డి, శివానందరెడ్డి, శ్రీధర్ రెడ్డిలలో ఒకరిని ఎంపిక చేద్దామని చంద్రబాబు డిసైడ్ అయ్యారు.
చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చి....
అయితే కేఈ కృష్ణమూర్తి చివరి నిమిషంలో చంద్రబాబుతో భేటీ అయి ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. సోదరుడు కేఈ ప్రభాకర్ కు ఈ స్థానం కేటాయించకుంటే తమ కుటుంబంలోనే విభేదాలు తలెత్తుతాయని, దీంతో పాటు తాను కూడా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని ఒకింత తీవ్రస్వరంతోనే చంద్రబాబుకు చెప్పినట్లు తెలిసింది. అయితే ఒకదశలో చంద్రబాబు కేఈని నచ్చ చెప్పేందుకు కూడా ప్రయత్నించారట. వచ్చే సారి ప్రభాకర్ కు అవకాశమిస్తానని చెప్పినా కేఈ ససేమిరా అన్నారట. ప్రభాకర్ కు ఇవ్వకుంటే తాను మంత్రివర్గంనుంచి తప్పుకుంటానని కూడా కేఈ ఒకింత గట్టిగానే చెప్పారు.
ఒకే కుటుంబంలో మూడు పదవులు...?
దీంతోపాటు కాపు రిజర్వేషన్లకు అసెంబ్లీలో ఆమోదించడంతో బీసీల్లో కొంత అసంతృప్తికి గురవుతున్నారని, కేఈ ప్రభాకర్ కు ఇస్తే బీసీలు సంతృప్తి పడతారని కూడా కేఈ చంద్రబాబుకు నచ్చ చెప్పారు. అంతేకాకుండా ఎన్నికకు అయ్యే ఖర్చు మొత్తాన్ని తామే భరిస్తామని కూడా చెప్పారు. దీంతో చంద్రబాబు కొంత మెత్తబడి చివరకు ప్రభాకర్ పేరు ఫైనల్ చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గానికి కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబుకు, డోన్ నియోజకవర్గాన్ని కేఈ మరో సోదరుడు కేఈ ప్రతాప్ కు అడుగుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ప్రభాకర్ కు దక్కడంతో ఒకే కుటుంబంలో మూడు పదవులు కేఈ కుటుంబానికి దక్కినట్లయింది. మొత్తానికి పత్తికొండ లో స్ట్రాంగ్ గా ఉన్న కేఈ ఫ్యామిలీ మరోసారి హైకమాండ్ వద్ద తన పట్టును నిలుపుకుంది. చంద్రబాబుపై వత్తిడి తెచ్చి మరీ టిక్కెట్ ను పొందగలిగింది. కేఈ ప్రభాకర్ తెలుగుదేశం అభ్యర్థిగా కొంతసేపటి క్రితం నామినేషన్ కూడా దాఖలు చేశారు.