కేఈ కోటను జగన్ బద్దలు కొడతారా?

Update: 2017-11-23 01:30 GMT

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర నేడు పత్తికొండ నియోజకవర్గానికి చేరుకోనుంది. జగన్ పాదయాత్ర నేడు 16వ రోజుకు చేరుకుంది. పత్తికొండ నియోజకవర్గానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేఈ కంచుకోటలో నేడు జగన్ అడుగుపెడుతున్నారు. ఇప్పటి వరకూ కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ, బనగానపల్లి, డోన్ నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర ముగిసింది. ఈరోజు నుంచి పత్తికొండ నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభమవుతుంది. రాత్రి పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్ది మండలంలోని నర్సాపురం క్రాస్ రోడ్డు వద్ద బస చేసిన జగన్ ఉదయం పాదయాత్రను ప్రారంభించనున్నారు.

200 కిలోమీటర్ల ప్రయాణంలో...

పత్తికొండ అంటేనే కేఈ సోదరులు గుర్తొస్తారు. పత్తికొండలో బలంగా ఉన్న కేఈ వర్గాన్ని ఢీకొట్టేందుకు జగన్ ఆ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. వెల్దుర్ది మండలం నర్సాపురం క్రాస్ రోడ్స్ నుంచి ప్రారంభయ్యే పాదయాత్ర రామల్లెపల్లె, బోయినపల్లి క్రాస్ రోడ్డు, రత్నపల్లి క్రాస్ రోడ్డుకు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్న భోజనానికి ఆగుతారు. అక్కడి నునంచి సాయంత్రానికి వెల్దుర్తి మండలం చేరుకుంటారు. ఇప్పటి వరకూ 15 రోజుల పాదయాత్రలో జగన్ 200 కిలోమీటర్లు నడిచారు. అడుగుడుగునా వైసీపీ కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలుకుతుండటంతో జగన్ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. గత మూడు రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జగన్ కొంత ఇబ్బంది పడుతున్నారు.

Similar News