కేఈ... ఎన్నిక...ఎన్నికకూ మాటమారుస్తారా?

Update: 2017-12-27 09:30 GMT

ఎన్నికల్లో పోటీ చేస్తే...ఒక మాట... పోటీ చేయకుంటే ఒక మాట... ఇదీ టీడీపీ నేతల తీరు. నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేసినందుకు వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కనీసం సెంటిమెంట్ లేని పార్టీ అన్నారు. జగన్ కు కుటుంబ సంబంధాలేమిటో తెలియవన్నారు. ఇప్పటికైనా నంద్యాల ఉప ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలని సూచించారు. ఈ మాటలు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి కిందిస్థాయి నేతల వరకూ అన్నారు. భూమా నాగిరెడ్డి మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో పోటీ చేయడం ఎందుకని... తాము గతంలో సెంటిమెంట్ ను గౌరవించలేదా? అని ప్రశ్నించారు.

నంద్యాలలో ఒకలాగా...

ఆ ఎన్నికల్లో జగన్ పోటీకి దిగారు. ఓటమి పాలయ్యారు. అది సాధారణ ఎన్నిక కావడంతో ప్రజలంతా ఓట్ల పండగలో పాల్గొన్నారు. చివరకు జగన్ కు ఓటమి తప్పలేదు. అనేక హామీలు...వరాలతో తెలుగుదేశం పార్టీవిజయం సాధించింది. నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోమని వైసీపీని కోరిన వారిలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఒకరు. ఇప్పుడు తాజాగా కర్నూలు ఎమ్మల్సీ ఎన్నికలు వచ్చాయి. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని వైసీపీ నిర్ణయించింది.

కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో....

స్థానికసంస్థల ఎన్నికలు కావడంతో ప్రజాప్రతినిధులే ఓటర్లుగా ఉండటంతో మరోసారి ఓటమి పాలు కావడం ఎందుకని వైసీపీ తప్పుకుంది. కాని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాత్రం వైసీపీ పోటీ చేయకపోవడం దివాలాకోరుతనంగా అభివర్ణించారు. నంద్యాలలో పోటీ చేయడం ఎందుకని ప్రశ్నించిన కేఈ ఈ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయకపోవడాన్ని దివాలాకోరుతనంగా అభివర్ణించడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. సోషల్ మీడియాలో కేఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు ఏకపక్షమేనన్నది అందరికీ తెలిసిందే. మరోసారి ఓటమి పాలు చేసి... పండగ చేసుకుందామనుకున్న టీడీపీ నేతలకు జగన్ ఈ సారి అవకాశం ఇవ్వకపోవడంతో కేఈ కృష్ణమూర్తి దివాలాకోరుతనంగా వర్ణించడం ఎంతవరకూ సబబన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తం మీద తమకు అనుకూలంగా ఉన్న ప్పుడు ఒకమాట... అనుకూలంగా లేనప్పుడు మరో మాట మాట్లాడటం రాజకీయ నేతలకు వెన్నతో పెట్టిన విద్యనేమో...!

Similar News