కేఈ ఊరుకుంటారా?

Update: 2017-12-22 07:30 GMT

కేఈ ప్రభాకర్ పట్టు పడుతున్నారు. తనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాల్సిందేనంటున్నారు. ఇటు సోదరుడు కేఈ కృష్ణమూర్తిపైనా అటు పార్టీ అధిష్టానంపైన వత్తిడి తెచ్చే కార్యక్రమాన్నికేఈ ప్రభాకర్ ప్రారంభించారు. కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడులయిన సంగతి తెలిసిందే. ఈ స్థానంలో గెలవగలిగనంత బలం టీడీపీకి ఉంది. స్థానికసంస్థల ప్రతినిధులే ఓటర్లు కావడంతో గెలుసు సునాయాసమని భావించిన కేఈ ప్రభాకర్ తనకు ఈసారైనాన్యాయం చేయాలని కోరుతున్నారు.

నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు...

కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం గురువారం కర్నూలులో జరిగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో ఈ సమావేశాన్ని మంత్రి కాల్వ శ్రీనివాసులు నిర్వహించారు. ప్రధానంగా పాణ్యం నియోజకవర్గానికి చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీలతోనే ఈ సమావేశం జరిగింది. నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలన్న చంద్రబాబు ఆదేశంతో మంత్రి కాల్వ ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. తొలుత పాణ్యం నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.

తాను బరిలోకి దిగుతానని..మంత్రి ముందే...

అయితే ఈ సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పాణ్యం నియోజకవర్గ ఇన్ ఛార్జి ఏరాసు ప్రతాపరెడ్డితో పాటుగా కేఈ ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. మంత్రి కాల్వ శ్రీనివాసులు మాత్రం అభ్యర్థిని రెండు రోజుల్లో అధినేత చంద్రబాబు నిర్ణయిస్తారని, అభ్యర్థి ఎవరైనా 300 ఓట్ల ఆధిక్యంతో గెలిచేలా అందరూ ప్రయత్నించాలని కోరారు.కాని ఇదే సమావేశంలో కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిన ఈ ఎన్నికల్లో తాను బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించడం అక్కడి ఉన్న వారిని సయితం ఆశ్చర్యపరిచింది. అయితే అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూస్తున్నానని చెప్పారు. గతంలోనూ కేఈప్రభాకర్ తెలుగుదేశం పార్టీపై తీవ్రంగా ధ్వజమెత్తారు. టీడీపీ బీసీలకు అన్యాయం చేస్తుందని కర్నూలు పట్టణంలో పెద్దయెత్తున ధర్నా కూడా చేశారు. దీంతో ఇటీవలే కేఈ ప్రభాకర్ కు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చారు. కాని తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఎప్పటి నుంచో ప్రభాకర్ కోరుతున్నారు. కాని గవర్నర్ కోటాలోనూ, శాసనసభ్యుల కోటాలోనూ దక్కలేదు. అయితే ఈసారి మాత్రం తనకు ఇవ్వాల్సిందేనని కేఈ పట్టుబడుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని భావిస్తుండటంతో కేఈ టిక్కెట్ దక్కకపోతే ఏం చేస్తారోనన్న టెన్షన్ అటు సోదరుడు కృష్ణమూర్తితో పాటు టీడీపీ జిల్లా నేతలకు కూడా పట్టుకుంది.

Similar News