కేంద్రాన్ని నిలదీస్తా

Update: 2018-03-03 13:30 GMT

కేంద్రం తన పెత్తనాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదని అర్థమైందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ఎంపీలతో చర్చించారు. రిజర్వేషన్ల విషయంలో తాము ఎన్ని అర్జీలు పెట్టుకున్నా కేంద్రం నుంచి స్పందన రాలేదని తెలిపారు. పారిశ్రామిక రాయితీలను తెలుగు రాష్ట్రాలకు ఏమీ ఇవ్వలేదన్నారు. తెలంగాణలో అనేక హామీలు అమలుపర్చకుండా పెండింగ్ లో ఉంచారన్నారు. కేంద్రాన్ని నిలదీస్తామని కేసీఆర్ హెచ్చరించారు. ఎప్పటికప్పుడు సమీక్షించుకుని ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పార్లమెంటులో పెండింగ్ హామీలపై తమ ఎంపీలు పోరాడతారని చెప్పారు.

ఎవరినీ దూషించలేదు...

ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పర్యటనలో తాను ప్రధానిని తూలనాడినట్లుగా మాట్లాడినట్లు ప్రచారం జరుగుతున్న దానిలో వాస్తవం లేదన్నారు. తాను అనలేదని, ప్రధానిని మీరే కించపర్చుకుంటామంటే తాను ఏమీ చేయలేనని చెప్పారు. బీజేపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని, పరిధి తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఎవరినైనా విమర్శించే హక్కు ఉంటుందన్నారు. కేసీఆర్ జైలుకు పోవాలని బీజేపీ నేతలు అంటున్నారని, తాను ప్రధానిని విమర్శిస్తే జైలుకు పంపుతారా? అని మండిపడ్డారు. అద్భుతపరమైన పాలన సాగిస్తుంటే జైలుకు పంపుతారా? అని అన్నారు. ప్రధాని స్వయంగా తన పాలనను పొగిడారన్నారు. తనను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. నా ఆస్తులన్నీ బహిరంగ రహస్యమేనన్నారు. ప్రతి ఏడాది తాను ఆదాయపు పన్ను లెక్కలు సమర్పిస్తానని చెప్పారు. ఎవరూ తనను ఏమీ చేయలేరని, అక్రమాలకు, కుంభకోణాలకు పాల్పడే వారు భయపడతారు కాని, తాను భయపడపోనని చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా రాజకీయాలు చేస్తానన్నారు. ప్రధానిని విమర్శించవద్దని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? అని అన్నారు.

సర్వేల్లో మాదే విజయం....

తన పార్టీ సభ్యులే 70 లక్షల మంది సభ్యులున్నారని, ప్రజలకు తనకు అవకాశమిచ్చారని, మంచి చేశామో, చెడు చేశామో ప్రజలు నిర్ణయిస్తారన్నారు. తాను రెండు సర్వేలు చేయించానని, ఆరున్నర లక్షల శాంపిల్స్ తీస్తే ఒక్క సర్వేలో 106 సీట్లు వస్తాయని వచ్చిందని, మరో సర్వేలో 103 సీట్లు వస్తాయని సర్వేలో తేలిందన్నారు. గడ్డం పెంచుకున్నంత మాత్రాన సీట్లు పెరుగుతాయా? అని ఎద్దేవా చేశారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ అధికారంలోకి వచ్చినా ఏం జరగదని, 70 ఏళ్లు రెండు పార్టీలూ ఏం చేయలేదని, ఆ మాటలకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానన్నారు. ఎవరినీ దూషించనని, దూషించే అలవాటే లేదని తెలిపారు. తెలంగాణలో మాట్లాడే భాషనే తాను మాట్లాడుతున్నానన్నారు. ఎవరికోసమే తన భాషను మార్చుకునేది లేదని చెప్పారు. తెలంగాణ బీజేపీ పార్టీ అసలు ఉందా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ కు పది సీట్లు రావు....

దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయని, పది సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం కంటే మెరుగైన పాలనను అందించామన్నారు. పదిఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 23 జిల్లాల కేపిటల్ వ్యయం లక్షా 39 కోట్లుకాగా, నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో పది జిల్లాలో తాము లక్షా 19 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. మిషన్ భగీరధ లాంటి పథకం, 24 గంటల విద్యుత్తు, కల్యాణలక్ష్మి వంటి పథకాలు టీఆర్ఎస్ డిజైన్ చేసినవేనని చెప్పారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు. రైతు శ్రేయస్సు కోసమే తాము పెట్టుబడి పథకాన్ని కూడా తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా వచ్చే ఎన్నికల్లో పది సీట్లు దాటవన్నారు. బీజేపీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. తాను ఏం చేయాలి? తెలంగాణలో ఆ పరిస్థితి ఉందన్నారు.

Similar News