ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అంటే అంతా తానై వ్యవహరించిన ఏపీ సీఎం సమయానుకూలంగా ప్లేట్ మార్చారు. అధికారంలోకి వచ్చినప్పటినుంచి పోలవరం ప్రాజెక్ట్ అంటే చంద్రబాబు అన్నంతగా ఆయన ప్రచారం సాగింది. నిధులు కేంద్రం ఇచ్చే ప్రాజెక్ట్ అయినా ప్రధాని మోడీ ప్రస్తావన నిన్న మొన్నటివరకు లేనేలేదు. అసెంబ్లీలో సైతం కేంద్రం తీరుపై ఇటీవల ఒకరకంగా కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు. ఇలా అయితే దణ్ణం పెట్టి ప్రాజెక్ట్ కట్టుకోమని కేంద్రానికే అప్పగిస్తామంటూ ఒక దశలో తాను ఇక చేయలేనని సంకేతాలు ఇస్తూ చేతులు ఎత్తేశారు. ఇప్పటిదాకా అయినా నిధులు ఇచ్చేయండి చాలు మాహా ప్రభో అన్న రీతిలో బాబు కామెంట్స్ సాగాయి. ఈ అంశాలన్నీ ప్రముఖంగా రావడంతో పోలవరం ప్రాజెక్ట్ అంశం సందిగ్ద స్థితిలో పడిందని అన్ని పక్షాలు ఒక్కసారిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మాటల దాడి తీవ్రం చేశాయి. దాంతో అటు కేంద్రంలోని గడ్కరీ ఏపీ సీఎం ను పిలిచి మరి సందేహాలకు తెరదించే ప్రయత్నం చేశారు.
ఏ ఒక్కరు చేయలేరన్న చంద్రబాబు ...
ఇక ఈ సమావేశం అనంతరం చంద్రబాబు ఎన్నడు లేనివిధంగా గడ్కరీ పై ప్రశంశల వర్షం కురిపించారు. ఆయన ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోతే ఎవ్వరు చేయలేరని ఆకాశానికి ఎత్తేశారు. ఆయన ప్రతి 15 రోజులకు ఒకసారి రాజమండ్రి వచ్చి పోలవరం ప్రాజెక్ట్ పనులు పరిశీలించి సాయంత్రానికి ఢిల్లీ వెళతారని మంత్రి షెడ్యూల్ సైతం సీఎం చెప్పడం దాంతో బాటు నిధులు కూడా వచ్చేస్తాయని, చేసిన పనులకు మూడు వేలకోట్ల రూపాయలు రావాలిసి ఉండగా 800 కోట్లరూపాయలు విడుదల అవుతాయని తరువాత ఫైనాన్స్ క్లియరెన్స్ వచ్చాక వచ్చే నెలలో మిగిలినవి ఇచ్చేస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. గడ్కరీ ప్రాజెక్ట్ పూర్తి కి చాలా కమిట్మెంట్ తో ఉన్నారన్నారు బాబు. గడ్కరీ చంద్రబాబు ప్రశంసలకు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ఏపీ సీఎం కి ఎంతటి చిత్తశుద్ధి ఉందో అదే తనకు ఉందన్నారు. వీరిద్దరి స్టేట్ మెంట్స్ లో గడ్కరీ 2019 కి పోలవరం పూర్తి అంటే పక్కనే వున్న చంద్రబాబు 2018 కె పూర్తి అనడం గమనార్హం. మొత్తానికి ఇన్నాళ్లు తామే పోలవరం అన్న రీతిలో వ్యవహరించిన తెలుగుదేశాధినేత కేంద్రం నిధులు విడుదల లో ఇచ్చిన ఝలక్ తో ప్రాజెక్ట్ పూర్తి గడ్కారీకే సాధ్యమనే స్థాయికి పరిస్థితి వెళ్ళిపోవడం చర్చనీయాంశం అయ్యింది.