చంద్రబాబు కేంద్రంతో కయ్యానికే సిద్ధమయ్యారు. విభజన హామీలను నెరవేర్చుకోవడానికి పోరాట పంథాను అనుసరించాల్సిందేనని నిర్ణయించారు. తెలుగుదేశం పార్లమెంటరీ బోర్డు సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి చంద్రబాబు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలతో పాటు ఆరుగురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతుతో కేంద్రంతో విభజన హామీల కోసం పోరాడాలని నిర్ణయించారు.
అన్ని పార్టీలకూ లేఖలు....
ఈనెల 5వ తేదీ నుంచి పార్లమెంటు సమవేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశంలో తిరిగి విభజన హామీల అమలు కోసం ఆందోళన చేయాలని నిర్ణయించారు. పార్లమెంటు లోపల, బయట ఆందోళనలు చేసి సమస్యను జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్లాలని సీఎం ఎంపీలకు ఉద్భోదించారు. దీంతో పాటు దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలను కలుపుకుని ఉద్యమం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం తమ పోరాటానికి మద్దతును కోరుతూ అన్ని జాతీయ, ప్రాతీయ పార్టీలకు లేఖలు రాయాలని సమావేశం నిర్ణయించింది.
జాతీయ స్తాయిలో ఉద్యమం.....
కేంద్రం నుంచి వచ్చిన నిధులు, హోదా ఇవ్వకుండా ప్యాకేజీ ప్రకటించి, అందులో ఏయే లొసుగులు కేంద్ర ప్రభుత్వం పెట్టిందీ లేఖలో సవవిరంగా అన్ని పార్టీలకూ తెలపాలని చంద్రబాబు నిర్ణయించారు. అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతులోనే పోరాటం చేసి కేంద్రాన్ని ఇరుకున పెట్టాలన్నది చంద్రబాబు వ్యూహంగా ఉంది. అయితే ఎంపీలు రాజీనామాలు చేయడం వల్ల ఉపయోగమేదీ ఉండదని కూడా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాజీనామాలు చేసినందున కేంద్రం దిగివస్తుందని తాను అనుకోవడం లేదని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అవిశ్వాసం కూడా ఇప్పుడే కాదని అన్ని పార్టీలనూ సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. అలాగే సమావేశంలో బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ పై చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇలాంటి ప్రాంతీయ విభేదాలు తీసుకురావాలిని భావిస్తే తాను పుట్టుకతోనే రాజకీయ నాయకుడినన్న విషయాన్ని వారు గుర్తుంచుకోవాలన్న తీవ్ర వ్యాఖ్యలు ఆయన చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద కేంద్రంపై జాతీయ స్థాయిలో పార్టీలన్నింటినీ కూడ గట్టి ఉద్యమించాలని చంద్రబాబు నిర్ణయించారు.