కేంద్రంతో కటీఫ్ కే మొగ్గు

Update: 2018-03-02 06:30 GMT

తెలుగుదేశం పార్టీ ఎంపీలు కమలం పార్టీతో తెగదెంపులు చేసుకునేందుకే సిద్దమయ్యారు. ఇన్నాళ్లూ సహనం వహించామని, ఇక ఓపిక పట్టే ప్రసక్తి లేదని టీడీపీ ఎంపీలు ఫైర్ అవుతున్నారు. ఈరోజు జరుగుతున్న పార్లమెంటరీ బోర్డు సమావేశానికి హాజరైన తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుల మనోగతమిది. ఇక కేంద్రాన్ని యాచించి ఉపయోగం లేదన్నది వారి భావన. అంతేకాదు... బీజేపీతో కొనసాగాలా? లేదా? అన్నది కూడా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని ఎంపీలు అంటున్నారు. బీజేపీ తమను చేతకాని వారిలా చూస్తుందని, దానికి తగిన సమాధానం చెప్పాలని ఎంపీలు గట్టిగా అధినేతను కోరుతున్నారు.

ఉండాలా? వద్దా?

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మాట్లాడుతూ అసలు బీజేపీతో ఉండాలా? వద్దా? అన్నది ఈ సమావేశంలో తేల్చుకోవాల్సి ఉందన్నారు. మార్చి 5వ తేదీ నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నామని చెప్పారు. విభజన సమయంలో హామీలు ఇచ్చి తర్వాత హామీలు అమలుపర్చకపోవడంతో పాటు తమపైనే మాటల దాడికి దిగుతుండటాన్ని కేశినేని నాని తప్పుపట్టారు. బీజేపీ అన్నీ మాటలే చెబతుందని, ఇంతవరకూ ఆచరణలో ఏదీ చూపించలేదన్నారు.

రాజీనామాలతో ఉపయోగం లేదు.....

ఇక కీలక నిర్ణయం తీసుకోవాల్సిందేనని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు రామ్మోహన నాయుడు అన్నారు. తాము పార్లమెంటులో ఎంత ఆందోళన చేసినప్పటికీ కదలిక కన్పించలేదన్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే తాము ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఇక అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అయితే తన దైన శైలిలో మాట్లాడారు. కేంద్రం వద్ద తాము బిక్షమెత్తుకునేందుకు ఎంపీలుగా గెలవలేదని చెప్పారు. హోదాకు ప్రత్యామ్నాయంగా ప్యాకేజీ ఇస్తామంటే ఒప్పుకున్నామని, ఈసారి హోదా విషయంలో తగ్గేది లేదని చెప్పారు. అయితే రాజీనామాల విషయంలో మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. రాజీనామాలతో కేంద్రం దిగివస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు. అయితే కేంద్రం నుంచి బయటకు రావాలని మాత్రం ప్రజలు భావిస్తున్నారని జేసీ అభిప్రాయపడ్డారు. మొత్తం మీద ఎంపీలందరూ దాదాపు కేంద్రంతో కటీఫ్ చెప్పడానికే మొగ్గు చూపుతున్నారు.

Similar News