అన్ని పార్టీల సర్వ సైన్యాలు హస్తిన బాట పట్టాయి. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు లక్ష్యంగా మొదలైన ఈ పోరాటం లో వైసిపి భారీ స్థాయిలో జనసమీకరణ తో ఢిల్లీ గద్దెపై రణనినాదం చేస్తుంది. ప్రత్యేక రైలు లో వెళ్ళిన వైసిపి గణం పార్లమెంట్ స్ట్రీట్ లో ధర్నాకు శ్రీకారం చుడుతుండగా వీరి ఆందోళన సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారనుంది. వీరి కార్యక్రమం తో పాటు వామపక్షాలు ఆందోళన ఢిల్లీ కేంద్రంగానే సాగనుంది. ఇక కాంగ్రెస్ 6 వ తేదీ నుంచి పోరాటానికి పిలుపునిచ్చింది. ఆ పార్టీ ముఖ్య నేతలు క్యాడర్ ఢిల్లీ చేరుకుంటున్నారు. కెవిపి రామచంద్రరావు, పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, మాజీ కేంద్రమంత్రులు కాంగ్రెస్ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నారు. ఇక టిడిపి పార్లమెంట్ కేంద్రంగానే తమ నిరసన గళం గతంలోలాగే లోపల బయట వినిపించనుంది.
టిడిపి ఉద్యమానికి అమిత్ బ్రేక్ ..?
పార్లమెంట్ లో బిజెపి పై యుద్ధానికి దిగిన మిత్రపక్షం టిడిపి ఆందోళనను అమిత్ షా బుజ్జగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టడంతో హోదా యుద్ధంలో పచ్చ పార్టీ వెనుకబాటుకు గురౌతుందా అన్న ఆందోళన ఆ పార్టీని వెంటాడుతుంది. కేంద్రమంత్రి సుజనాచౌదరి నేతృత్వంలో తెలుగుదేశం ఎంపీలు అమిత్ షా తో భేటీకి ఆహ్వానం వచ్చింది. దీనిపై టిడిపి మల్లగుల్లాలు పడుతుంది. ఆ భేటీలో అనుసరించాలిసిన విధివిధానాలపై అధినేత చంద్రబాబు ఇప్పటికే ఎంపీలకు దిశా నిర్ధేశం చేసేశారు. కాకపోతే కమలదళపతి అనుసరించే ఎత్తుగడలు అప్పటికప్పుడు ఎదుర్కోవడం అంత ఈజీ కాదన్నది టిడిపి నేతల అభిప్రాయం. ఒక పక్క అదే సమయంలో ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తూ ఉండటంతో అధినేత ఢిల్లీ దిశా నిర్ధేశం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని తమ్ముళ్లు భావిస్తున్నారు.
కేంద్రం తలవంచే ప్రశ్నే లేదా ...?
ఈశాన్య రాష్ట్రాల విజయంతో జోష్ మీదున్న కాషాయ దళం ఏపీ ఉద్యమాన్ని తీసికట్టుగానే చూసే పరిస్థితే ఉందంటున్నారు విశ్లేషకులు. ఎంత అరిచి గీ పెట్టినా తాము అనుకున్నదే చేయాలని కమలం పార్టీ భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. అన్ని వైపులా ముప్పేట దాడి జరుగుతున్నా గత నెల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోడీ, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ స్పందించిన తీరు గమనిస్తే తెగేదాకా లాగేందుకే కేంద్రం సిద్ధం అయ్యిందన్న సంకేతాలు అందుతున్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రాష్ట్రంలోను, కేంద్రంలో మంత్రులు కలిసి ఉన్నంత కాలం టిడిపి బీజేపీ ఎత్తులను ప్రజలు నమ్మే పరిస్థితి తక్కువేనని మెజారిటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు ముగిసేవరకు హస్తిన రాజకీయాలవైపు అందరి చూపు నిలిచింది.