కెప్టెన్...పగ్గాలు ఎవరికి ఇస్తారంటే...?

Update: 2018-02-21 17:30 GMT

తమిళనాట రోజురోజుకూ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. సినీలోకంపై వీరాభిమానం చూపే తమిళ తంబిలు అనేక ఏళ్ల నుంచి సినీనటులనే ఆదరిస్తూ వస్తున్నారు. ఎంజీఆర్, జయలలిత సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులయ్యారు. అలాగే కరుణానిధి కూడా సినీ రంగానికి చెందిన వారే. దీంతో సినీనటులకు తమిళనాట ఉన్న క్రేజ్ తో వారు మేకప్ వేసుకోలేని దశలో పాలిటిక్స్ లోకి ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు తాజాగా కమల్ హాసన్, రజనీకాంత్ లదీ అదే దారి. తమిళనాట మరో నటుడు కూడా ఎప్పుడో రాజకీయ పార్టీ పెట్టారు. ఆయనే విజయకాంత్. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకున్న ఈయన పార్టీ గత ఎన్నికల్లో గల్లంతయింది.

భార్య, బావమరిదితో.....

విజయకాంత్ పార్టీ కూడా కుటుంబ పార్టీగా మారిందన్న విమర్శలు వచ్చాయి. విజయ్ కాంత్ సతీమణి ప్రేమలత, బావమరిది సుదీష్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కొందరు డీఎండీకే నేతలు దీనికి అభ్యంతరం కూడా చెప్పారు. మరికొందరు తిరుగుబాటు కూడా చేశారు. రాజకీయ అవగాహన లేనివాళ్లు తమపై పెత్తనం చేస్తున్నారని కొందరు బాహాటంగా విమర్శలు చేయడంతో కెప్టెన్ కూడా కొంత వెనక్కు తగ్గారు. తాజాగా ఆయన తన కుమారుడిని కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. భార్యను, బావమరిదిని పక్కన పెట్టి తన రాజకీయ వారసుడిగా విజయ్ ప్రభాకర్ ను అరంగేట్రం చేయించాలని చూస్తున్నారు. ఇటీవల కమల్ హాసన్ కూడా కలిసినప్పుడు తన కుమారుడి భవిష్యత్ పై కెప్టెన్ ఆయనతో చర్చించినట్లు చెబుతున్నారు.

ఆరోగ్యం కూడా సహకరించక....

విజయకాంత్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయకాంత్ కు ఇద్దరు కుమారులు. అందులో షణ్ముగ పాండ్యన్ సినీనటుడిగా ఉన్నారు. మరోకుమారుడు విజయ్ ప్రభాకర్ మాత్రం వ్యాపారాలు చేస్తున్నారు. విజయ్ ప్రభాకర్ ను రాజకీయాల్లోకి తీసుకురావాలన్న ఆకాంక్షను ఇటీవల విజయకాంత్ తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేశారు. భార్య కంటే కుమారుడిని తేవడమే బెటర్ అని పలువురు సన్నిహితులు ఆయనకు సూచించారు. ఈ నేపథ్యంలో విజయ్ ప్రభాకర్ ను నేరుగా పార్టీలోకి తీసుకురాకుండా విజయ్ కాంత్ దశలవారీగా ఆయనకు పదవులు అప్పగించాలని యోచిస్తున్నారు.

కుమారుడిని దశలవారీగా....

భార్య ప్రేమలత, బావమరిది సుదీష్ కారణంగానే పార్టీ నష్టపోయిందని విజయకాంత్ ఆలస్యంగా గ్రహించారు. సన్నిహితుల సూచన మేరకు వారిని చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం పార్టీ లో సమస్యలను చర్చించి పరిష్కరించేందుకు విజయకాంత్ ఇటీవల ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి మాజీ శాసనసభ్యుడు వెంకటేశ్ ను ఛైర్మన్ గా నియమించారు. వెంకటేశ్ విజయకాంత్ కు వీరాభిమాని. అంతేకాదు విజయ్ కాంత్ భార్య ప్రేమలత, బావమరిది సుధీష్ లను వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి. దీంతో ఆయన ద్వారా కుమారుడిని దశలవారీగా పదవులు ఇచ్చి అధికారులను తర్వాత పూర్తి స్థాయిలో అప్పగించాలని నిర్ణయించారు. ఈకమిటీ ఇప్పటికే వివిధ జిల్లాలకుచెందిన పార్టీ నేతలతో సమావేశమై అభిప్రాయాలను సేకరిస్తోంది. విజయ్ ప్రభాకర్ ను పార్టీ యువజన విభాగం అద్యక్షుడిగా నియమించే అవకాశముందని తెలుస్తోంది. అధ్యయన కమిటీ నివేదిక ఇవ్వగానే పార్టీలోకి విజయ్ ప్రభాకర్ చేరిపోయినట్లే. మొత్తం మీద భార్య, బావమరిదిని పక్కనపెట్టేందుకు కుమారుడును రంగంలోకి దించుతున్న కెప్టెన్ ఆశలు వచ్చే ఎన్నికల్లోనైనా నెరవేరతాయో? లేదో? చూడాలి.

Similar News