కృష్ణాలో తిరగబడిన మరో పడవ....!

Update: 2018-01-16 02:30 GMT

కృష్ణా జిల్లాలో మరో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. సంక్రాంతి రోజున ఎదురుమొండి దీవులనుంచి వస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు అందులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బోటు తిరగబడిన వెంటనే స్థానికులు తక్షణం ప్రమాదస్ధలికి చేరి సాయం అందించడంతో వీరంతా బతికి బట్ట కట్టారు. కొంత కాలం క్రితమే ఇబ్రహీం పట్నం నదీ సంగమ ప్రమాదం మరిచిపోకముందే ఈ సంఘటన జరగడం సంచలనం అయ్యింది. వరుసగా జరుగుతున్న సంఘటనలతో పడవ ప్రయాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

పడవ పోటీలకు ఫంట్ లు పంపడంతోనే ...

కృష్ణా దీవుల నుంచి ప్రయాణికులను చేరవేసే ఫంట్ లను ఇటీవల పడవల పోటీలకు తరలించారు. దీనివల్లే నాటు పడవల్లో ప్రయాణాలు చేయాలిసి వస్తుందని బాధితులు ఆందోళన వ్యక్తం చేసారు. తమ ఫంట్ ను మండలి ప్రసాద్ బలవంతంగా తరలించారని ఆరోపిస్తున్నారు. సురక్షిత ప్రయాణాలు జరిగేలా ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News